రాహుల్ కోసం నా బంగ్లాను ఖాళీ చేస్తా: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే
రాహుల్ గాంధీకి పార్లమెంటు సభ్యుడిగా ఆయనకు కేటాయించిన దిల్లీలోని అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలని లోక్‍సభ హౌసింగ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. ఈ పరిణామంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే మంగళవారం స్పందించారు. అధికార భారతీయ జనతా పార్టీపై ఎదురుదాడికి దిగారు. రాహుల్‌గాంధీ బలహీనపరిచేందుకు అధికార పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. రాహుల్ తన బంగ్లాను ఖాళీ చేస్తే, అతను తన తల్లితో కలిసి ఉంటారని, లేదా అయన కోసం తనకు కేటాయించిన ఒక బంగ్లాను ఖాళీ చేస్తానని చెప్పారు. రాహుల్ గాంధీని భయపెట్టడం, బెదిరించడం, అవమానించడం వంటి ప్రభుత్వ వైఖరిని తాను ఖండిస్తున్నట్లు మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు. ఇది సరైన మార్గం కాదన్నారు.
హౌసింగ్ కమిటీ నుంచి రాహుల్ గాంధీ పొడిగింపును కోరవచ్చు
కొన్నిసార్లు మూడు లేదా నాలుగు నెలలు పాటు బంగ్లా లేకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయన్నారు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే. తనకు ఒకసారి ఆరు నెలల తర్వాత బంగ్లాను కేటాయించినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు బంగ్లా కోసం అధికార పార్టీ ఇంత రాద్దాంతం చేయడం తగదన్నారు. వాయనాడ్ ఎంపీగా గెలిచిన రాహుల్ గాంధీకి తుగ్లక్ లేన్‌లోని బంగ్లా - 12ను కేటాయించారు. అయితే అనర్హత వేటు నేపథ్యంలో నెలరోజుల్లో ఖాళీ చేయాలని లోక్‌సభ సెక్రటేరియట్ సోమవారం రాహుల్ గాంధీకి నోటీసు జారీ చేసింది. అయితే హౌసింగ్ కమిటీ నుంచి రాహుల్ గాంధీ పొడిగింపును కోరవచ్చని, అభ్యర్థనను పరిశీలిస్తామని సీనియర్ అధికారి ఒకరు పీటీఐకి వెల్లడించారు.