
Bandi Sanjay: ఎమ్మెల్సీగా గెలుపు.. బీజేపీనే ప్రధాన ప్రతిపక్షం: బండి సంజయ్
ఈ వార్తాకథనం ఏంటి
కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ నియోజకవర్గ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య గెలుపుతో ఉపాధ్యాయులు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై నమ్మకంతోనే ఉపాధ్యాయులు ఈ నిర్ణయం తీసుకున్నారని, ఈ విజయం టీచర్లకు, మోదీకే అంకితమని పేర్కొన్నారు.
కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశానికి బండి సంజయ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మల్క కొమరయ్యతో పాటు ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ మేయర్ సునీల్ రావు, బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు క్రిష్ణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి జె. సంగప్ప, తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావులతో కలిసి మీడియాతో మాట్లాడారు.
Details
ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు
చారిత్రాత్మక తీర్పునిచ్చిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఇది సాధారణ విజయం కాదని, 5,900 ఓట్ల భారీ తేడాతో మల్క కొమరయ్య విజయం సాధించారని బండి సంజయ్ చెప్పారు.
ప్రధానమంత్రి మోదీపై దేశవ్యాప్తంగా మేధావి వర్గం నమ్మకంతో ఉందని, ఇటీవల బడ్జెట్‌లో ఉద్యోగులకు రూ. 12.75 లక్షల వరకు పన్ను మినహాయింపు కల్పించడంపై ఉపాధ్యాయులు అంగీకారం తెలిపారని పేర్కొన్నారు.
బీజేపీ కార్యకర్తలు పూర్తిస్థాయిలో ఈ ఎన్నికలో శ్రమించారని కొనియాడారు. టీచర్ల సమస్యలపై పోరాడే సత్తా బీజేపీకి, కొమరయ్యకే ఉందని ఉపాధ్యాయులు నమ్మారన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించిన బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీజేపీ అభ్యర్థి కొమరయ్యను ఓడించేందుకు కుట్రలు పన్నాయని బండి సంజయ్ ఆరోపించారు.
Details
మల్క కొమరయ్య స్పందన
త్వరలో ప్రకటించే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితాల్లో కూడా బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీగా గెలిచిన మల్క కొమరయ్య స్పందించారు.
తన గెలుపునకు బీజేపీ కార్యకర్తలు, తపస్ సహకారం వల్లనే ఈ విజయం సాధించానని, చెప్పారు. తనపై నమ్మకంతో ఓటేసిన ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలన్నారు.