
Parliament: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. 16 బిల్లులపై దృష్టి
ఈ వార్తాకథనం ఏంటి
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి.
డిసెంబర్ 20 వరకు మొత్తం 19 రోజులపాటు సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా కేంద్రం ఆదివారం ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించింది.
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు.
30 పార్టీలకు చెందిన 42 మంది నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
కాంగ్రెస్ నేత జైరాం రమేశ్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, బీఆర్ఎస్ నేత కేఆర్ సురేశ్ రెడ్డి సహా ఇతర ప్రతిపక్ష నేతలు తమ డిమాండ్లను కేంద్రానికి తెలిపారు.
Details
పెండింగ్ లో ఉన్న బిల్లులపై దృష్టి
కాంగ్రెస్ ప్రతినిధులు అదానీ గ్రూప్‌పై లంచం ఆరోపణలు, మణిపూర్ అల్లర్లు, కాలుష్యం, రైలు ప్రమాదాలు వంటి అంశాలపై చర్చించాలని కోరారు.
బీఆర్ఎస్ పార్టీ విభజన చట్టంలోని అంశాలు, తెలంగాణలో అమృత్ స్కీమ్ కాంట్రాక్టులపై దృష్టి సారించాలని అభ్యర్థించింది. టీడీపీ, జనసేనలు విభజన హామీల అమలుపై పట్టుబట్టాయి.
రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపక్షాల సహకారం కోరుతూ, సభలు సజావుగా సాగేందుకు కేంద్రం అన్ని అంశాలపై చర్చకు సిద్ధమని తెలిపారు.
ఈ సెషన్‌లో కేంద్రం ఉభయ సభల్లో 16 బిల్లులు ప్రవేశపెట్టనుంది.
వాటిలో కొన్ని కొత్త బిల్లులే గాకుండా, ఇప్పటికే లోక్‌సభ లేదా రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్న బిల్లులు కూడా ఉన్నాయి.
Details
సభల్లో ప్రవేశపెట్టే బిల్లులు
విపత్తు నిర్వహణ సవరణ బిల్లు
ముస్లిం వక్ఫ్ (రీపీల్) బిల్లు
కోస్టల్ షిప్పింగ్ బిల్లు
వన్ నేషన్ - వన్ ఎలక్షన్ బిల్లు
సివిల్ కోడ్ బిల్లు
నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని సెంట్రల్ హాల్‌లో సంవిధాన్ సదన్ నిర్వహించనున్నట్టు కేంద్రం ప్రకటించింది.
మరోవైపు వక్ఫ్ సవరణ బిల్లుపై జేపీసీ తన నివేదికను నవంబర్ 29న సమర్పించే అవకాశం ఉంది. ఈ సమావేశాలు ప్రతిపక్షాలు, ప్రభుత్వ మధ్య వాడీవేడిగా సాగనున్నాయి.
పలు కీలక బిల్లుల చర్చతో పాటు, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇష్యూస్‌పై సమగ్ర చర్చలు జరగనున్నాయి.