LK Advani: 'భారతరత్న' ప్రకటించడంపై కన్నీళ్లు పెట్టుకున్న అద్వానీ
బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రకటించారు. ప్రధాని ప్రకటన తర్వాత అద్వానీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ఈ వార్త తెలియగానే లాల్ కృష్ణ అద్వానీ కూడా భావోద్వేగానికి గురయ్యారు. భారతరత్న ప్రకటన అనంతరం అద్వానీ కుమార్తె ప్రతిభా అద్వానీ మీడియాతో మాట్లాడారు. నాన్న చాలా సంతోషంగా ఉన్నారని ప్రతిభా అద్వానీ అన్నారు. నాన్న తన భావాలను చాలా అరుదుగా వ్యక్తపరుస్తారని ఆమె చెప్పుకొచ్చారు.
దేశానికి అద్వానీ కృతజ్ఞతలు
భారతరత్న ప్రకటించిన విషయాన్ని తన తండ్రికి చెప్పినప్పుడు ఆయన చాలా సంతోషించారని కుమార్తె ప్రతిభ అన్నారు. తన జీవితమంతా దేశ సేవకే వెచ్చించానని, ఈ సందర్భంగ దేశానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు అద్వానీ చెప్పినట్లు ప్రతిభ వెల్లడించారు. భారతరత్న ప్రకటించిన విషయం చెప్పగానే తన అద్వానీ కళ్లలో నీళ్లు తిరిగాయని ప్రతిభ అన్నారు. ఈరోజు తన తల్లిని చాలా మిస్ అవుతున్నానని ప్రతిభ పేర్కొన్నారు. లాల్ కృష్ణ అద్వానీ జీవితంలో ఆమె సహకారం చాలా గొప్పదన్నారు.