Page Loader
Maharashtra: రన్నింగ్ బస్సులోనే బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. బస్సు కిటికీ నుంచి బయటకు విసిరేసిన భర్త.. నవజాత శిశువు మృతి
రన్నింగ్ బస్సులోనే బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. బస్సు కిటికీ నుంచి బయటకు విసిరేసిన భర్త.. నవజాత శిశువు మృతి

Maharashtra: రన్నింగ్ బస్సులోనే బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. బస్సు కిటికీ నుంచి బయటకు విసిరేసిన భర్త.. నవజాత శిశువు మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 16, 2025
10:43 am

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్రలో మరొక అమానవీయ ఘటన వెలుగుచూసింది. కదులుతున్న బస్సులోనే ఒక యువతి ప్రసవించి,కొద్దిసేపటికే ఆ పసికందును కిటికీ మార్గంగా బయటకు విసిరేసిన ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ అమానవీయ చర్య వల్ల ఆ శిశువు మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే... మహారాష్ట్ర పర్‌బాణీ జిల్లాలో మంగళవారం ఈ ఘటన జరిగింది. రితికా ధేరే (19) అనే యువతి తన భర్త అల్తాఫ్‌ షేక్‌తో కలిసి పుణె నుండి పర్‌బాణీకి ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వారు స్లీపర్ కోచ్ బస్సులో ప్రయాణిస్తుండగా మార్గమధ్యంలో రితికాకు అకస్మాత్తుగా పురిటినొప్పులు వచ్చాయి. ఆ సందర్భంలోనే ఆమె బస్సులోనే ప్రసవించి,మగ బిడ్డకు జన్మనిచ్చింది.

వివరాలు 

బస్సు కిటికీ ద్వారా బిడ్డను బయటకు విసిరేశారు 

అయితే, కొద్ది క్షణాల్లోనే ఆ శిశువును వారు ఒక వస్త్రంలో చుట్టి, బస్సు కిటికీ ద్వారా బయటకు విసిరేశారు. ఈ క్రమంలో బస్సు డ్రైవర్‌ బస్సు కిటికీ నుంచి ఏదో విసిరినట్లు గుర్తించి, వెంటనే అల్తాఫ్‌ను ప్రశ్నించాడు. అయితే అతను సరైన సమాధానం ఇవ్వకుండా తప్పించుకోవడానికి యత్నించాడు. ఆదివారం ఉదయం 6.30 గంటల సమయంలో స్థానికులు బస్సు వెళ్తున్న మార్గంలో కింద పడిన వస్తువు తాలూకు కదలికను గమనించి అక్కడికి వెళ్లారు. ఓ వస్త్రంలో చుట్టి ఉన్న పసికందును చూసి షాక్‌కు గురయ్యారు. అప్పటికే ఆ శిశువు మృతిచెందినట్లు తెలుసుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

వివరాలు 

పుణెలో నివసిస్తున్న రితికా, అల్తాఫ్‌

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని,పెట్రోలింగ్ సిబ్బంది సహాయంతో ఆ బస్సును ఆపించారు. బస్సులోని ఇతర ప్రయాణికులను విచారించిన అనంతరం రితికా,అల్తాఫ్‌లను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణలో ఆ దంపతులు మాట్లాడుతూ ఆ బిడ్డను పెంచే సామర్థ్యం తమకు లేదని, అందుకే వదిలేసినట్లు అంగీకరించారు. పోలీసుల సమాచారం ప్రకారం,రితికా, అల్తాఫ్‌లు గత 18 నెలలుగా పుణెలో నివసిస్తున్నారు. అయితే వీరు నిజమైన భార్యాభర్తలేనా అన్న విషయంలో ఎలాంటి ఆధారాలు తమ వద్ద లేవని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో మృతశిశువును వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రితికాను వైద్య చికిత్స నిమిత్తం ఆస్పత్రికి పంపినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.