
Hyderabad: కూకట్‌పల్లిలో మహిళ దారుణ హత్య.. కాళ్లు,చేతులు కట్టేసి.. కుక్కర్‌తో తలపై కొట్టి
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఓ మహిళ దారుణ హత్యకు గురయ్యారు. ఆమె ఇంట్లో వంట మనిషిగా పని చేస్తున్న రోషన్, అతనితో కలిసి వచ్చిన హర్ష్ ఇద్దరూ కలిసి ఆమె చేతులు, కాళ్లను తాళ్లతో కట్టేసి.. చిత్రహింసలు పెడుతూ.. తలపై కుక్కర్‌తో గట్టిగా కొట్టి హత్య చేశారు. తర్వాత, భారీ మొత్తంలో నగదు, బంగారం విలువైన వస్తువులు దోచుకుని పరారయ్యారు. హత్య జరగిన తర్వాత వారు ఇంట్లోనే స్నానం చేసి, కొత్త దుస్తులు ధరించి యజమాని కుటుంబానికి చెందిన స్కూటీపై పారిపోయారు.
వివరాలు
తొమ్మిదేళ్లుగా వంట మనిషిగా రోషన్
ఈ దారుణ ఘటన కూకట్‌పల్లిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధిత దంపతులు రాకేశ్ అగర్వాల్, రేణు అగర్వాల్ (50) ఫతేనగర్‌లో స్టీలు వ్యాపారం నిర్వహిస్తున్నారు. వారి కుమార్తె తమన్నా ఇతర రాష్ట్రాల్లో చదువుకుంటున్నారు.కుమారుడు శుభం తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. రేణు అగర్వాల్ స్వాన్ లేక్‌లోని తమ బంధువుల ఇంట్లో నివసిస్తున్నారు. జార్ఖండ్ నుండి వచ్చిన రోషన్ గత తొమ్మిదేళ్లుగా రేణు అగర్వాల్ ఇంట్లో పని చేస్తున్న వంట మనిషిగా ఉన్నాడు. ఇటీవల, హర్ష్‌ను కూడా రేణు ఇంట్లో వంట మనిషిగా నియమించారు, ఇది 11 రోజుల క్రితం జరిగింది.
వివరాలు
హత్య తరువాత ఇంట్లోనే స్నానం...
బుధవారం ఉదయం రాకేశ్ అగర్వాల్, శుభం ఇద్దరూ దుకాణానికి వెళ్లారు. ఇంట్లో రేణు అగర్వాల్ ఒంటరిగా ఉన్నారు. సాయంత్రం ఐదింటికి భర్త, కుమారుడు ఫోన్ చేసినప్పటికీ ఆమె స్పందించలేదు. సుమారు సాయంత్రం 7 గంటల సమయంలో రాకేశ్ ఇంటికి వచ్చి తలుపు తట్టినప్పటికీ స్పందన రాకపోవడంతో ప్లంబర్‌ను పిలిపించి, వెనుక వైపు ద్వారం ద్వారా లోపలికి వెళ్లి తలుపు తెరిపించారు. ఇంట్లోకి వెళ్లిచూడగా... రేణు అగర్వాల్ రక్త మడుగులో పడిపోయి, చేతులు, కాళ్లు తాళ్లతో కట్టబడి ఉన్న స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. ఆమె తల, గొంతు, ఇతర శరీర భాగాలపై తీవ్రమైన గాయాలు కనిపించాయి. పోలీసులకు ఫిర్యాదు చేయగా... హర్ష్, రోషన్‌లు ఈ దారుణానికి పాల్పడినట్లు వారు నిర్ధారించారు.
వివరాలు
సీసీ కెమెరాల్లో సూట్‌కేసుతో వెళుతున్న నిందింతుల దృశ్యాలు
రేణు అగర్వాల్‌ను తాళ్లతో బంధించి, డబ్బులు, నగలు ఎక్కడున్నాయో చెప్పాలంటూ చిత్రహింసలు పెట్టినట్లు తెలుస్తోంది. కూరగాయల కత్తితో ఆమె గొంతును కోశారు. చివరికి కుక్కర్‌తో తలపై గట్టి కొట్టి ఆమెను హత్య చేశారు. నిందితులు ఇంట్లోని లాకర్లు తెరిచి నగదు, బంగారాన్ని సూట్‌కేసులో సర్దుకున్నారు. ఖాళీ చేతులతో వచ్చిన ఇద్దరూ సూట్‌కేసులతో తిరిగి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో గుర్తించారు. హత్య అనంతరం వారు రక్తపు దుస్తులను అక్కడే వదిలేసి స్నానం చేసి, కొత్త దుస్తులు వేసుకున్నారు. ఇంటికి తాళం వేసి యజమాని కుటుంబానికి చెందిన స్కూటీపై పారిపోయారు.
వివరాలు
నిందితుల కోసం ఐదు బృందాలు గాలింపు
నిందితుల కోసం పోలీసులు ఐదు బృందాలతో గాలిస్తున్నారు. బాలానగర్ డీసీపీ సురేశ్‌కుమార్, కూకట్‌పల్లి ఏసీపీ రవికిరణ్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ వెంకటసుబ్బారావు, డాగ్ స్క్వాడ్, వేలిముద్ర నిపుణులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.