దర్గాలో డ్యాన్స్ చేసిన మహిళ.. తప్పుబట్టిన మతపెద్దలు, దర్గా నిర్వాహకులు
ప్రసిద్ధ అజ్మీర్ దర్గా ఆవరణలో ఓ మహిళ డ్యాన్స్ చేస్తున్న వీడియో వివాదానికి దారి తీసింది. సదరు మహిళ ప్రార్ధనా స్ధలం పవిత్రతకు భంగం కలిగించారని పెద్ద ఎత్తున విమర్శల వర్షం కురుస్తోంది. రాజస్ధాన్‌లోని తారాఘడ్ హిల్ పాదాల వద్దనున్న ప్రముఖ దర్గా అజ్మీర్ షరిఫ్ లో డ్యాన్స్ చేయడాన్ని మసీదు నిర్వాహకులు సైతం తప్పుబట్టారు. గ్రే, పింక్ కుర్తా దుపట్టా ధరించిన మహిళ ఇయర్ ఫోన్స్‌లో సంగీతాన్ని ఆస్వాదిస్తూ డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అయ్యింది. ప్రార్ధనా స్ధలం అనే ధ్యాస కూడా లేకుండా బీట్స్‌కు అనుగుణంగా సదరు మహిళ స్టెప్పులు వేయడాన్ని మత పెద్దలు ఖండించారు.
దర్గాలో డ్యాన్స్ లాంటివి చేయడం నిషిద్ధం: దర్గా నిర్వాహకులు
అజ్మీర్ దర్గా పరమ పవిత్ర ప్రదేశమని చెప్పిన మత గురువులు, ఇక్కడ బయట సంగీత కచేరీలు లాంటివి నిషిద్ధమన్నారు. ఈ విషయాన్ని సదరు మహిళ తెలుసుకుని ప్రవర్తించాలని దర్గా నిర్వాహకులు స్పష్టం చేశారు. సదరు మహిళా డ్యాన్స్ చేస్తున్న సమయంలోనే అక్కడికి వచ్చిన సహచర సందర్శకుడు డ్యాన్స్ ను వీడియో తీసినట్టు సమాచారం. భారతదేశంలోనే పవిత్ర స్ధలాల్లో ఒకటిగా గుర్తించబడుతున్న అజ్మీర్ దర్గాను వివిధ మతాలకు చెందిన మతపెద్దలు, గురువులు నిత్యం సందర్శిస్తారు. 2022 అక్టోబర్‌లో ఉజ్జయినిలోని మహంకాళీ ఆలయంలో కొందరు డ్యాన్స్ వీడియోలు తీయడం కలకలం సృష్టించింది. ఇన్‌స్టాగ్రామర్ల డ్యాన్స్ వీడియోలపై ఆలయ అర్చకులు మండిపడ్డారు.