తెలుగు రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాల్లో నారీమణుల జయభేరి.. మహిళలకు భారీగా దక్కనున్న సీట్లు
మహిళా రిజర్వేషన్ బిల్లు 2023కి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఈ డిమాండ్ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు-2023లో నేరవేరనుంది. లోక్ సభ, రాజ్యసభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ దక్కనుంది. ఈ మేరకు ఎగువసభలో 181, రాజ్యసభలో 80కిపైగా స్థానాలను మహిళలకు కేటాయించనున్నారు. ప్రస్తుతం లోక్ సభలో 82 మంది మహిళా ఎంపీలు మాత్రమే ఉండగా, మరో వంద మందికి ప్రాతినిధ్యం దక్కనుంది. మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రభావం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై తీవ్రంగానే పడనుంది. ప్రస్తుతం తెలంగాణలో 119 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. 119 నియోజకవర్గాల్లో సుమారు 40 స్థానాలు మహిళలకే కేటాయించాల్సి ఉంటుంది.
బీఆర్ఎస్ పార్టీకి సీట్ల చిక్కులు
17 పార్లమెంట్ స్థానాల్లో 6 సీట్లు మహిళలకే ఇచ్చే అవకాశం ఉంది. ఏపీలో 175 అసెంబ్లీ సీట్లు, 25 పార్లమెంట్ సీట్లుండగా, 58 అసెంబ్లీ టికెట్లు, 8 లోక్ సభ స్థానాలను మహిళలకే కేటాయించనున్నారు. ఈ నేపథ్యంలోనే మహిళా బిల్లుతో తెలుగు రాష్ట్రాల రాజకీయాల స్వరూపం మారిపోనుంది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి చిక్కులు : మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందాక, బీఆర్ఎస్ పార్టీకి కొత్త చిక్కులు ఎదురుకానున్నాయి. 115 స్థానాలకు ఇప్పటికే గులాబీ బాస్ కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించేశారు. మరో 4 సీట్లకు మాత్రమే అభ్యర్థులను పెండింగ్ లో పెట్టారు. బిల్లు కారణంగా 30 నుంచి 40 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాల్సి ఉంది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ప్రకటించకపోవడం గమనార్హం.