LOADING...
India-US: ట్రంప్‌ పదవీకాలం ముగిసేవరకు చూస్తాం: ట్రేడ్‌ డీల్‌పై భారత్‌  
ట్రంప్‌ పదవీకాలం ముగిసేవరకు చూస్తాం: ట్రేడ్‌ డీల్‌పై భారత్

India-US: ట్రంప్‌ పదవీకాలం ముగిసేవరకు చూస్తాం: ట్రేడ్‌ డీల్‌పై భారత్‌  

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 05, 2026
08:31 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-భారత్ మధ్య తాజాగా కుదిరిన వాణిజ్య ఒప్పందానికి (India-US Trade Deal) ముందు జరిగిన కీలక పరిణామాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఈ ఒప్పందంపై చర్చలు సాగుతున్న సమయంలోనే, ఇరుదేశాల నాయకుల మధ్య జరిగిన ఒక కీలక సమావేశంలో భారత్‌ తన వైఖరిని స్పష్టంగా వెల్లడించినట్లు సమాచారం. వాణిజ్య ఒప్పందం కోసం అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పదవీకాలం పూర్తయ్యేవరకు వేచి చూడడానికైనా సిద్ధమని భారత్‌ తెలిపినట్లు బ్లూమ్‌బర్గ్‌ తన కథనంలో వెల్లడించింది. ఈ అంశం ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

వివరాలు 

బెదిరింపులకు భారత్‌ తలవంచదు 

బ్లూమ్‌బర్గ్‌ కథనం ప్రకారం, గత ఏడాది సెప్టెంబరు ప్రారంభంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్,అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మధ్య కీలక సమావేశం జరిగింది. ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు భారత ప్రభుత్వంపై ట్రంప్‌,ఆయన వాణిజ్య సలహాదారు పీటర్‌ నవారో తదితరులు బహిరంగంగా విమర్శలు చేయడం,టారిఫ్‌ల విషయంలో భారత్‌ను పలుమార్లు హెచ్చరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో జరిగిన భేటీలో భారత్‌ తన అభిప్రాయాన్ని తేల్చి చెప్పినట్లు కథనం పేర్కొంది. ట్రంప్‌ లేదా ఆయన పరిపాలనలోని అధికారుల నుంచి వచ్చే బెదిరింపులకు భారత్‌ తలవంచబోదని, అవసరమైతే వాణిజ్య ఒప్పందం కోసం ట్రంప్‌ పదవీకాలం ముగిసేవరకు కూడా ఎదురుచూస్తామని అజిత్‌ దోవల్ రూబియోకు స్పష్టంగా తెలిపినట్లు బ్లూమ్‌బర్గ్‌ వెల్లడించింది.

వివరాలు 

తగ్గిన భారత్‌-అమెరికాల మధ్య ఉద్రిక్తతలు

అలాగే భారత్‌పై బహిరంగ విమర్శలు తగ్గిస్తే ఇరుదేశాల మధ్య సంబంధాలు మళ్లీ సానుకూల దిశలో సాగుతాయని దోవల్ సూచించినట్లు సమాచారం. ఈ సమావేశం జరిగిన కొన్ని రోజులకే భారత్‌-అమెరికాల మధ్య ఉద్రిక్తతలు తగ్గినట్లు తెలుస్తోంది. అనంతరం ట్రంప్‌ ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయనపై ప్రశంసలు కురిపించారు. అయితే ఈ భేటీ వివరాలపై అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి స్పందిస్తూ, ప్రైవేటుగా జరిగిన చర్చల విషయాలను బయటకు వెల్లడించలేమని స్పష్టం చేశారు. మరోవైపు, ఈ అంశంపై భారత్‌ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Advertisement