ఒడిశాలో జపాన్ మియాజాకి రకాన్ని సాగు చేస్తున్న టీచర్.. కిలో మామిడి రూ.3 లక్షలు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి 'మియాజాకి'ని ఇప్పుడు భారతదేశంలోనూ పండిస్తున్నారు.ఇంటర్నేషనల్ మార్కెట్లో కిలో మామిడి రూ. 2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఉండటం దీని ప్రత్యేకత. ఈ పండ్ల సాగును తొలుత జపాన్ లోనే పండించారు. దీని అసలు పేరు టైయో నొ టమగోగా పిలుస్తారు. ఎగ్ ఆఫ్ ది సన్ అని కూడా అంటారు. ఖరీదైన మియాజాకి ఫలాన్ని ఒడిశాకు చెందిన ఓ ఉపాధ్యాయుడు పండిస్తున్నారు. ఓ వైపు టీచర్ గా పాఠాలు చెబుతూ మరోవైపు మామిడి తోటలో శ్రమిస్తున్నారు. కలహండి జిల్లాలోని కందుల్‌గూడ గ్రామంలో రక్షాకర్ భోయ్ ఖరీదైన మామిడి తోటను సాగు చేస్తున్నారు. ఉద్యానవనశాఖ అధికారుల సహకారంతో మియాజకి మామిడి విత్తనాలను సేకరించానని రక్షాకర్ వెల్లడించారు.
ఈ పండు తీసుకుంటే శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయి
ప్రత్యేకమైన రంగు సంతరించుకున్న మియాజాకి అమోఘమైన రుచి దాగుంది. సాంప్రదాయ రకాలైన బంగినపల్లి, తోతాపురి, నూజివీడు రకాలతో పోల్చితే ఇది చాలా భిన్నమైంది. ఇందులో ఏ, సీ విటమిన్లు సహా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా నిక్షిప్తమై ఉన్నాయి. ఈ పండు తీసుకుంటే శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అంది వ్యాధులను తట్టుకుని నిలబడే శక్తిని సొంతం చేసుకోవచ్చని చెబుతుంటారు. మాక్రో పోషకాలైన ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం నిలువలు ఈ మ్యాంగోలో ఉండటంతో విదేశాల్లోనూ వీటికి డిమాండ్ భారీగా ఉంటుందని రక్షాకర్ చెప్పుకొచ్చారు. ఏటా ఏప్రిల్‌లో మియాజాకిని మార్కెట్లో అత్యుత్తమైన మామిడి పండ్లుగా వేలం వేస్తారు. ఇటీవలే సిలిగురి, రాయ్‌పుర్, శిలిగుడిలో నిర్వహించిన మ్యాంగో ఫెస్టివల్స్ లో దీన్ని ప్రదర్శనకు ఉంచడం విశేషం.