Arvind Kejriwal:అరవింద్ కేజ్రీవాల్‌ను ఈరోజు అరెస్టు చేసే అవకాశం? ఆప్ నేతలలో భయాలు
దిల్లీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించి గురువారం ఉదయం అరెస్ట్ చేసే అవకాశం ఉందని తమకు సమాచారం అందిందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పేర్కొంది. దిల్లీ లిక్కర్ స్కామ్‌లో విచారణకు హాజరు కావాల్సిందిగా ED తనకు జారీ చేసిన మూడవ సమన్లను కేజ్రీవాల్ దాటవేయడంతో పార్టీ నేతలు అతిషి, సౌరభ్ భరద్వాజ్, జాస్మిన్ షా ట్వీట్స్ చేశారు. "రేపు ఉదయం ED అరవింద్ కేజ్రీవాల్ నివాసంపై దాడి చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అరెస్టు చేసే అవకాశం ఉంది" అని అతిషి బుధవారం రాత్రి ట్వీట్ చేశారు. అతిషి సహచరులు భరద్వాజ్,షా కూడా ఇలాంటి ట్వీట్లే చేశారు.
'మై భీ కేజ్రీవాల్' పేరుతో ప్రచారం
ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్టు చేయాలని ED ఉద్దేశించిందని,ఎన్నికల ప్రచారం నుండి ఆయనను నిరోధించాలని ప్రయత్నిస్తున్నట్లు ఆప్ ఆరోపించింది. గత ఏడాది నవంబర్ 2,డిసెంబర్ 21న దర్యాప్తును దాటవేయగా.. నిన్న కూడా విచారణకు వెళ్లలేదు. AAP అధిష్టానం ఆ సమన్లను కూడా ఇల్లీగల్ అని, రాజకీయ వేధింపులకు పాల్పడుతోందని కేంద్రంలోని బీజేపీపై విమర్శలు చేస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్టు చేస్తే రాజీనామా చేయాలా లేక జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపించాలా అనే అంశంపై ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకు పార్టీ నేతలు 'మై భీ కేజ్రీవాల్' పేరుతో ప్రచారం నిర్వహిస్తున్నారు. దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కేజ్రీవాల్ సహచరులు మనీష్ సిసోడియా,సంజయ్ సింగ్ ఇప్పటికే జైలులో ఉన్నారు.