
Air India Plane Crash: విదేశీ మీడియాలో తప్పుడు ప్రచారం.. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారమే దర్యాప్తు : రామ్మోహన్ నాయుడు
ఈ వార్తాకథనం ఏంటి
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇటీవల అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న ఎయిర్‌ఇండియా ఘోర విమాన ప్రమాదం (Air India Plane Crash)పై రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా విపక్షాల నుంచి వచ్చిన ప్రశ్నలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సమాధానమిచ్చారు. ఈ ఘటనపై విదేశీ మీడియా అసత్య ప్రచారం చేస్తోందని మంత్రి వ్యాఖ్యానించారు.
Details
ప్రత్యేక దర్యాప్తుతో ముందుకు
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదిక ఇప్పటికే వచ్చింది. దానిని పరిశీలిస్తున్నాం. తుది నివేదిక వెలువడిన తర్వాతే పూర్తి సమాచారం వెల్లడికావచ్చు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఈ దుర్ఘటనపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) పారదర్శకంగా దర్యాప్తు నిర్వహిస్తోంది. అయినప్పటికీ, విదేశీ మీడియా వాస్తవాలకు విరుద్ధంగా ప్రచారం చేస్తోంది. ఇలాంటి ఘటనలపై తాము సత్యాన్వేషణకే కట్టుబడి ఉంటామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారంగా దర్యాప్తు కొనసాగుతోందని మంత్రి వివరించారు.
Details
బ్లాక్‌బాక్స్ డేటా సేకరణ పూర్తి
ప్రమాదానికి గురైన విమానంలోని బ్లాక్‌బాక్స్‌ల డేటాను విజయవంతంగా సేకరించాం. దానిపై విచారణ సాగుతోంది. ప్రమాద సమయంలో ఏం జరిగింది అనేది తుది నివేదిక వచ్చాకే వెల్లడవుతుంది. దర్యాప్తు ప్రక్రియను ప్రతిఒక్కరూ గౌరవించాలని కోరుతున్నామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. విపక్షాల వాకౌట్, లోక్‌సభలో వాయిదాలు ఇక, రాజ్యసభలో పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌పై చర్చ జరగాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. చర్చ జరగకపోవడంతో వారు సభను వాకౌట్ చేశారు. మరోవైపు, లోక్‌సభలోనూ ఇదే అంశాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడి, పలుమార్లు వాయిదాలు పడింది.