పవన్ కల్యాణ్ నిజంగానే చాలా గొప్పవాడివి.. కానీ ఈ ఒక్క పనిచేస్తేనే: పోసాని
సినీనటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి మరోసారి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయ్యాడు. పవన్ తీరుతో కాపుల్లో చిచ్చు రేగుతోందన్న పోసాని, కాపులను తిడుతూ చంద్రబాబును పొగడటం ఏమిటని విస్మయం వ్యక్తం చేశారు. చంద్రబాబు డైరెక్షన్ చేస్తుంటే పవన్ యాక్ట్ చేస్తున్నట్లు ఆరోపించారు. పవన్ కనీసం ఎమ్మెల్యేగానైనా గెలుస్తాడో లేదో తెలియదని ఎద్దేవా చేశారు. కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభం గొప్ప కుల నాయకుడని కొనియాడారు. ముద్రగడ రాజకీయ, ఆర్థిక లాభాల కోసం పాకులాడలేదన్నారు. కాపుల కోసం, కాపు ఉద్యమం కోసం, కాపు జాతి కోసం, కాపు రిజర్వేషన్ల కోసం సర్వం ధారపోశారని అన్నాడు. కులం కోసం ఆస్తులను, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడన్నారు. చివరకు అవమానాల ఎదురైతే మంత్రి పదవినే విసిరికొట్టాడన్నారు.
వంగవీటి రంగాను హత్య చేయించింది చంద్రబాబే : పోసాని
పవన్ కన్నా ముద్రగడే గొప్ప నాయకుడని పోసాని ప్రశంసించారు. వంగవీటి రంగాను హత్య చేయించింది చంద్రబాబేనని పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముద్రగడకు వెంటనే క్షమాపణలు చెప్పాలని పవన్ ను డిమాండ్ చేశారు. ముద్రగడ పద్మనాభం 1981 నుంచే కాపుల సంక్షేమం, అభివృద్ధి కోసం పోరాడుతున్నారని పోసాని గుర్తు చేశారు. తన ఉద్యమంలో ఆయన ఒక్క రూపాయి అవినీతిని చేసాడని నిరూపించినా తాను రాజకీయాలకు గుడ్ బై చెబుతానన్నారు. ఒకవేళ అవినీతిని నిరూపించలేకపోతే పవన్ ఎక్కడికీ వెళ్లనవసరం లేదని, ముద్రగడకు క్షమాపణ చెబితే చాలన్నారు. ఈ ఒక్క పని చేస్తే జనసేన చీఫ్, పవన్ కల్యాణ్ నిజంగానే చాలా గొప్పవాడివి అవుతావని పోసాని అన్నారు.