వైసీపీ కాపు నేతలతో ముద్రగడ కీలక భేటీ.. ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ
ఒక అల్పహార విందు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిణామాలపై జరిగిన ఆ చర్చపైనే అందరి దృష్టి నెలకొంది. ఇంతకీ అది ఏంటంటే, వైకాపా కాపు ప్రజాప్రతినిధులు కాపు నేత ముద్రగడ నివాసానికి వెళ్లి ఆయనతో అల్పాహార విందులో పాల్గొనటం పైనే ఇప్పుడు ఏపీలో పొలిటికల్ డిస్కషన్. ఏపీలో 'కాపు' రాజకీయాలు మొదలయ్యాయి.ఈనెల 14 నుంచి పవన్ వారాహి యాత్ర నేపథ్యంలో వైసీపీ ముద్రగడను తెరపైకి తెస్తోందని విశ్లేషకుల మాట. అయితే తాము ముందస్తు ఎన్నికలకు వెళ్లబోమని,షెడ్యూల్డ్ ప్రకారమే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు కేవలం 9 నెలలే ఉన్న క్రమంలో ఏపీ రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి.
కాపు రాజకీయాలు.. పవన్ ఎత్తులకు వైసీపీ పైఎత్తులు
తాజాగా మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభంతో అధికార వైకాపా కాపు నేతలు భేటీ అయ్యారు. కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటికి వెళ్లి ఆయనతో అల్పాహార విందుకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, పలువురు ఎంపీపీలు, కాపు సంఘం నేతలు పాల్గొన్నారు. కాపు రిజర్వేషన్ ఉద్యమ సమయంలో గతంలో తునిలో రైలుకు నిప్పు పెట్టిన ఘటనలో మాజీ మంత్రి ముద్రగడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే అందుకు సంబంధించిన కేసుల నుంచి ముద్రగడకు వైకాపా సర్కార్ విముక్తి కల్పించింది. ప్రస్తుతానికి ముద్రగడ ఏ పార్టీలోనూ క్రీయాశీలకంగా లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ముద్రగడతో అధికార పార్టీ కాపు నాయకుల భేటీ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది.