Pinneli Rama Krishna Reddy: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి అరెస్ట్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీసులు ఉదయం నుంచి గాలిస్తున్నారు. చివరకు సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ గ్రామంలో అరెస్టు చేశారు. ఇస్నాపూర్‌లోని ఓ కంపెనీ గెస్ట్‌హౌస్‌లో పిన్నెలి దాక్కున్నట్లు సమాచారం అందుకున్న మాచర్ల పోలీసు అధికారులు స్థానిక పటాన్‌చెరు పోలీసులతో సమన్వయం చేసుకుని పిన్నెలిని అరెస్టు చేయడంలో విజయం సాధించారు. పిన్నెలి తన నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్‌లో EVM, VVPAT యంత్రాలను డ్యామేజ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎన్నికల సంఘం పిన్నెలిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.పిన్నెలిపై క్రిమినల్ కేసు నమోదైంది.
పిన్నెలి సంగారెడ్డి వైపు వెళ్తున్నట్లు సమాచారం
ఎన్నికల సంఘం ఆదేశాలు వెలువడ్డాక అయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ప్రత్యేక బృందాన్ని హైదరాబాద్‌కు పంపగా, తెలంగాణ టాస్క్‌ఫోర్స్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతని కోసం వెతకడం ప్రారంభించారు. ఈ ఉదయం పిన్నెలి సంగారెడ్డి వైపు వెళ్తున్నట్లు సమాచారం అందింది. సంగారెడ్డి పట్టణ సమీపంలోని కంది గ్రామంలో స్థానిక పోలీసులు అతని వాహనాన్ని పట్టుకున్నారు,అయితే పిన్నెలి తప్పించుకోగలిగారు. పోలీసులు అతని డ్రైవర్‌ను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. ఈ మధ్యాహ్నం అతని ఆచూకీ తెలియడంతో, పోలీసు అధికారులు విజయవంతంగా పిన్నెలిని అదుపులోకి తీసుకున్నారు.