
ATM: రైల్లో ప్రయాణం చేస్తూనే నగదు తీసుకోవచ్చు.. సెంట్రల్ రైల్వే నూతన ప్రయోగం
ఈ వార్తాకథనం ఏంటి
త్వరలో రైళ్లలోనూ ఏటీఎం సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు షాపింగ్ మాల్స్, కార్యాలయాల్లో చూస్తున్న ఈ సదుపాయం.. త్వరలో కదిలే ఏటీఎంల రూపంలో ప్రయాణికుల దరికి చేరనుంది.
ఈ విధంగా, ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించేందుకు రైల్వే శాఖ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.
ఈ క్రమంలో సెంట్రల్ రైల్వే విభాగం తొలిసారిగా ముంబయి-మన్మాడ్ పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ఏటీఎంను ఏర్పాటు చేసింది. ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ సేవలను త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని అధికారులు భావిస్తున్నారు.
Details
పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ఎటిఎం
ముంబయి ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ నుంచి మన్మాడ్ జంక్షన్ దాకా నిత్యం నడిచే పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రైవేట్ బ్యాంక్‌కు చెందిన ఏటీఎంను ఏసీ ఛైర్‌కార్ కోచ్‌లో ఏర్పాటు చేశారు.
ఈ ఏటీఎంను గతంలో తాత్కాలిక ప్యాంట్రీగా ఉపయోగించిన స్థలంలో ఏర్పాటు చేయగా, భద్రత దృష్ట్యా ప్రత్యేకంగా షట్టర్ డోర్ అమర్చారు.
మరిన్ని మార్పులను మన్మాడ్ వర్క్‌షాప్‌లో నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ విధంగా రైలు కదులుతున్నప్పుడు ప్రయాణికులు ఏటీఎం సేవలను సురక్షితంగా వినియోగించగలుగుతారు.
ఈ కొత్త ఆవిష్కరణ ద్వారా ప్రయాణికుల కోసం సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయని, త్వరలోనే ఇతర మార్గాల్లో నడిచే రైళ్లలోనూ ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చే అవకాశముందని రైల్వే శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది.