Shambhavi Choudhary:బాలికల విద్య కోసం ఐదేళ్ల జీతం.. ఉదారత చాటుకున్న బీహార్ ఎంపీ
బిహార్‌లోని లోక్‌సభ సభ్యురాలు శాంభవి చౌదరి, తన ఐదేళ్ల పదవీకాలంలో వచ్చే మొత్తం జీతాన్ని బాలికల విద్య కోసం విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. లోక్ జనశక్తి పార్టీ (రామ్‌విలాస్) ఎంపీ అయిన శాంభవి, తన నియోజకవర్గమైన సమస్తిపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ నిర్ణయం వెల్లడించారు. బాలికల విద్యకు ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో, తన సంపూర్ణ వేతనాన్ని ఈ దిశగా వెచ్చిస్తానని తెలియజేశారు.
"పఢేగా సమస్తిపూర్ తో బఢేగా సమస్తిపూర్"
2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ శాంభవి సేవా కార్యక్రమాలను కొనియాడారు. అలాగే శాంభవిని ఎన్‌డీఏ అభ్యర్థిగా ఎంపిక చేశారు. తన జీతాన్ని "పఢేగా సమస్తిపూర్ తో బఢేగా సమస్తిపూర్" ఉద్యమంలో ఉపయోగించబోతున్నట్లు శాంభవి తెలిపారు. ప్రతి నెల జీతం రూపంలో వచ్చే ఈ నిధులను, ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు మానేయాల్సిన బాలికల కోసం వినియోగించనున్నట్లు స్పష్టం చేశారు.