
Jyoti Malhotra Case: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా దేశద్రోహం కేసు.. రంగంలోకి యాంటి టెర్రర్ విభాగం
ఈ వార్తాకథనం ఏంటి
హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా దేశద్రోహ ఆరోపణలపై భారత ఇంటెలిజెన్స్ యంత్రాంగం తీవ్ర స్థాయిలో దర్యాప్తు ప్రారంభించింది. ఈకేసులో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్, ఢిల్లీలోని పాక్ హైకమిషన్ అధికారులు కీలక పాత్ర వహించారా అనే కోణంలో లోతుగా విచారణ సాగుతోంది. ఈ కేసును మరింత లోతుగా పరిశీలించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఫెడరల్ యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించేందుకు యోచిస్తోంది. ఈ ఏజెన్సీ దేశ భద్రతకు సంబంధించిన అతి సున్నితమైన కేసులను విచారించడంలో ప్రావీణ్యం కలిగినది. జ్యోతి మల్హోత్రా పాక్ ఇంటెలిజెన్స్ సంస్థలతో ఉన్న సంబంధాలు, ఆమె చేసిన అంతర్జాతీయ పర్యటనలు, సమాచారం బదిలీ జరిగిన మార్గాలు వంటి అంశాలపై విస్తృతంగా వివరాలు సేకరించేందుకు ఇప్పటికే చర్యలు ప్రారంభమయ్యాయి.
Details
14 మంది పాక్ గూఢచారులు అరెస్టు
ఇండియన్ ఇంటెలిజెన్స్ వర్గాల అభిప్రాయం ప్రకారం, ఈ కేసు వెనుక విదేశీ కుట్ర దాగి ఉండే అవకాశం ఉంది. ఇప్పటివరకు దేశద్రోహ కార్యకలాపాల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో 14 మంది పాక్ గూఢచారులను అరెస్టు చేశారు. వీరంతా పాక్ ఐఎస్ఐకి ఏజెంట్లుగా, సమాచార పంపిణీదారులుగా పనిచేస్తున్నట్లు దర్యాప్తులో స్పష్టమైంది. గత రెండు వారాలుగా నార్త్ ఇండియాలో ఈ అరెస్టులు చకచకా జరుగుతున్నాయి. జ్యోతి మల్హోత్రాతో సంబంధాలు ఉన్న దేశంలోని ఇతర వ్యక్తులను కూడా దర్యాప్తు సంస్థలు గాలిస్తున్నాయి. అలాగే పాక్ హైకమిషన్ అధికారులపై కుట్రలో భాగస్వాములుగా ఉన్నారా అనే అనుమానంతో ఆరా తీస్తున్నారు. ఈ కేసు దేశ భద్రతకు తీవ్రమైన ముప్పుగా మారే అవకాశముండటంతో, కేంద్రం అత్యంత శ్రద్ధతో పరిశీలిస్తున్నది.