Sailajanath: వైసీపీలోకి కాంగ్రెస్ సీనియర్ నేత.. జగన్ సమక్షంలో పార్టీలో చేరిన శైలజానాథ్..
ఈ వార్తాకథనం ఏంటి
మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తాడేపల్లిలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా సాకే శైలజానాథ్ మాట్లాడుతూ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ విధానాలు నచ్చడంతోనే తాను వైసీపీలో చేరినట్లు తెలిపారు.
ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను చేపడుతోందని విమర్శించారు.
ఎన్నికల ముందు అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలను ఒక్కటీ కూడా నెరవేర్చలేకపోయిందని ఆరోపించారు.
ప్రజల సంక్షేమానికి ఈ కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని పేర్కొన్నారు. రాయలసీమ ప్రజల కష్టాలను తీర్చేందుకు తన వంతు కృషి చేస్తానని శైలజానాథ్ స్పష్టం చేశారు.
వివరాలు
ఏ బాధ్యతనైనా పూర్తి నిబద్ధతతో నిర్వర్తిస్తా: శైలజానాథ్
అలాగే, రాజకీయాలు ప్రజా ప్రయోజనాల కోసమే చేయాలి గాని వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాల కోసం కాకూడదని ఆయన వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ నుంచి మరికొందరు నేతలు కూడా వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
అయితే, ఎవరెవరు చేరతారనేది ఇప్పుడే చెప్పలేనని అన్నారు.
జగన్ తనకు అప్పగించే ఏ బాధ్యతనైనా పూర్తి నిబద్ధతతో నిర్వర్తిస్తానని శైలజానాథ్ తెలిపారు.