Page Loader
Sake Sailajanath: నేడు వైసీపీలోకి మాజీ మంత్రి శైలజానాథ్.. పార్టీలోకి ఆహ్వానించనున్న వైఎస్ జగన్ 
నేడు వైసీపీలోకి మాజీ మంత్రి శైలజానాథ్

Sake Sailajanath: నేడు వైసీపీలోకి మాజీ మంత్రి శైలజానాథ్.. పార్టీలోకి ఆహ్వానించనున్న వైఎస్ జగన్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 07, 2025
08:38 am

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సాకే శైలజానాథ్ ఈరోజు (ఫిబ్రవరి 7)వైస్సార్సీపీ పార్టీలో చేరుతున్నారు. గతేడాది డిసెంబర్ నుంచి ఆయన పార్టీ మారబోతున్నారనే వార్తలు వినిపించినప్పటికీ, ఇవాళ ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన అధికారికంగా వైసీపీలో చేరుతున్నారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు పలువురు అనుచరులు కూడా పార్టీలో చేరనున్నట్లు సమాచారం. శైలజానాథ్ వైసీపీలో చేరిన తర్వాత జగన్ బెంగళూరు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. సాకే శైలజానాథ్ అనంతపురం జిల్లాకు చెందిన నేత. ఆయన తన రాజకీయ ప్రయాణాన్ని కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రారంభించారు.

వివరాలు 

ఏపీసీసీ  అధ్యక్షుడిగా.. 

శింగనమల నియోజకవర్గం నుంచి 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా కూడా సేవలు అందించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడినప్పటికీ, ఆయన పార్టీని వీడలేదు. 2022లో ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే, 2024 ఎన్నికలకు ముందు శైలజానాథ్ తెలుగుదేశం పార్టీలో చేరతారనే ప్రచారం జరిగింది. మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డిని కలవడంతో ఆయన టీడీపీలో చేరడం ఖాయమని భావించారు. కానీ, చివరకు ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగారు. అనంతరం రాజకీయాల్లో పెద్దగా చురుకుగా పాల్గొనలేదు. చివరకు, ఈరోజు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.