Ys Jagan: అసెంబ్లీకి వైఎస్ జగన్.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్!
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు.
ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు. జగన్‌తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా అసెంబ్లీలో హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఇంతకుముందు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని జగన్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో తనకు సరైన గౌరవం లభించదన్న అనుమానం వ్యక్తం చేయడంతో, ఆయన గైర్హాజరుపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి.
అసెంబ్లీకి హాజరుకావడం లేదనే కారణంతో జగన్‌పై అనర్హత వేటు పడే అవకాశముందని టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు.
Details
షర్మిల విమర్శల తర్వాత జగన్ నిర్ణయం
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు, జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల కూడా అసెంబ్లీకి రాకపోవడంపై విమర్శలు చేశారు.
అసెంబ్లీకి రావడానికి జగన్‌కు మొహం లేదంటూ వ్యాఖ్యానించిన ఆమె, కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం జగన్‌కు లేదా? అంటూ ధ్వజమెత్తారు.
ఈ నేపథ్యంలో జగన్ తన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రజల సమస్యలపై అధికార పక్షాన్ని నిలదీయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం.
బడ్జెట్, సూపర్ 6 హామీలపై ప్రశ్నలు
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల హామీల అమలు తీరుపై ప్రశ్నించాలనే వ్యూహంతో జగన్ ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
'సూపర్ 6' హామీల అమలు, నిధుల కేటాయింపు వంటి అంశాలపై వైసీపీ ప్రశ్నించే అవకాశం ఉంది
Details
కేవలం గవర్నర్ ప్రసంగానికే పరిమితమా?
అయితే జగన్ అసెంబ్లీకి హాజరవ్వాలని తీసుకున్న నిర్ణయం వెనుక మరో వ్యూహం ఉందన్న చర్చ కూడా సాగుతోంది.
జగన్ కేవలం గవర్నర్ ప్రసంగం వరకు మాత్రమే అసెంబ్లీలో ఉండి, ఆ తర్వాత మళ్లీ సమావేశాలకు దూరంగా ఉండే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు.
టీడీపీ నాయకులు పలు మార్లు అసెంబ్లీకి వరుసగా 60 రోజులు గైర్హాజరైతే అనర్హత వేటు పడుతుందని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో జగన్ తన సభ్యత్వాన్ని కాపాడుకోవడానికి మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.