Ys Sharmila :ఈసారి పోటీ చేయబోం.. కేసీఆర్ వ్యతిరేక ఓటు చీల్చబోమన్న షర్మిల
వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ప్రకటన చేశారు. ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేయట్లేదని ప్రకటించారు. ఈ మేరకు కేసీఆర్ తెలంగాణ ప్రజలు మోసం చేస్తున్నారన్న ఆమె, కేసీఆర్ పాలన అంతం కోసమే పార్టీ ఏర్పాటు చేశామన్నారు. అయితే ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే ఉద్దేశం లేనందునే పోటీకి దూరంగా ఉన్నామన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసమే 3,800 కి.మీ పాదయాత్ర : వైఎస్ షర్మిల
మరోవైపు తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకాలు అందలేదన్న షర్మిల, 3,800 కిలోమీటర్లు పాద యాత్ర చేశామన్నారు. కేసీఆర్ తీసుకున్న ప్రతి ప్రజా వ్యతిరేక నిర్ణయంపై ఆ పార్టీని, ప్రభుత్వాన్ని నిలదీశామన్నారు. తాము ఎల్లప్పుడూ ప్రజల పక్షానే ఉన్నామన్నారు. అసలు కేసీఆర్ అక్రమాల గురించి మాట్లాడిన ఏకైక పార్టీ వైఎస్సార్ టీపీ అని ఆమె చెప్పుకొచ్చారు. తమ పార్టీ కాళేశ్వరం కుంభకోణం గురించి మాట్లాడిందని గుర్తు చేసిన షర్మిల, కేసీఆర్ రూ.5 లక్షల కోట్ల అప్పులు చేశారన్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పోరాటం తర్వాతే ప్రతిపక్షాలు కేసీఆర్ ను నిలదీశాయన్నారు. కాంగ్రెస్'కి అనుకూల సమయంలో రాజశేఖర్ బిడ్డగా పార్టీని ఒడిస్తావా అని కాంగ్రెస్ నేతలు తనను అడిగినట్లు షర్మిల చెప్పుకొచ్చారు.