వివేకా హత్య కేసు: సుప్రీంకోర్టును ఆశ్రయించిన దస్తగిరి
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దస్తగిరి అప్రూవర్ గా మారడాన్ని సవాల్ చేసిన ఎంవీ కృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటీషన్ వేసారు. ఈ పిటీషన్ పై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే తనకు న్యాయ సహాయం కావాలని, న్యాయవాదిని పెట్టుకునేంత ఆర్థిక స్తోమత తన దగ్గర లేదని సుప్రీంకోర్టును దస్తగిరి ఆశ్రయించాడు. ఈ విషయమై సోమవారం నాడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. దస్తగిరి పిటీషన్ పై సుప్రీంకోర్టు ఎలా స్పందించనుందనేది అందరిలోనూ ఆసక్తిగా మారింది.
కుట్రలో భాగంగానే వివేకా హత్య
ఇదిలా ఉంటే, దస్తగిరి అప్రూవర్ గా మారడాన్ని వైఎస్ వివేకా హత్య కేసులోని నిందితుడు శివ శంకర్ రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేసారు. ఈ విషయమై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, సవాల్ చేసే హక్కు నిందితులకు ఉండదని పేర్కొంది. వివేకా హత్య కేసు కుట్రలో భాగంగానే జరిగిందనీ సీబీఐ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ హత్యలో ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి పాల్గొన్నారని, సాక్ష్యాలను ద్వంసం చేయడంలో ఎంపీ అవినాష్ రెడ్డి, శివ శంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి పాల్గొన్నారని సీబీఐ తెలియజేసింది.