
Motivational: చాణిక్యుడి ప్రకారం జీవితం నాశనం చేసే ఐదు ముఖ్యమైన తప్పులు ఇవే..
ఈ వార్తాకథనం ఏంటి
ప్రాచీన భారతదేశపు మహానుభావుడు,ఆచార్య చాణక్యుడు జీవన సారాన్ని తెలిపే ఎన్నో విలువైన సూత్రాలను మనకు అందించాడు. జీవితంలో విజయాన్ని సాధించాలంటే కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. అదే సమయంలో కొన్ని తప్పుడు అలవాట్లను వదిలేయడం కూడా అవసరం. చాణక్యుని ప్రకారం మనిషి ఓటమికి ప్రధాన కారణం అతడు చేసే చిన్న చిన్న తప్పులే. అలాంటి తప్పులు మనం చేయకూడదు. చాణక్యుని నీతులు అనుసరిస్తే జీవితం ఎలా ఉండాలో స్పష్టంగా తెలుస్తుంది. ప్రతి ఒక్కరికీ ఆనందం,అభివృద్ధి కావాలని ఉంటుంది. అయితే... బహుశా ప్రతినిత్యం కష్టపడినా, అహర్నిశలు శ్రమించినా కొన్నిసార్లు అనుకున్న ఫలితాలు రాకపోవచ్చు.
వివరాలు
1. లక్ష్యం లేని జీవితం అనర్ధం
దీనికి ప్రధాన కారణం మన దైనందిన జీవితంలో చేస్తున్న కొన్ని అపరాధాలు,తప్పులే కావచ్చు. చాణక్య నీతి గ్రంథంలో ఈ తప్పుల గురించి స్పష్టంగా పేర్కొన్నాడు. ఇవి మన పురోగతికి అడ్డుపడతాయి. కనుక వాటిని నివారించాల్సిన అవసరం ఉంటుంది. చాణక్యుని అభిప్రాయం ప్రకారం, ప్రతి మనిషి తన జీవితానికి ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. దిశానిర్దేశం లేకుండా జీవించటం సమయం,శక్తి రెండింటినీ వృథా చేసే పని. ఒక లక్ష్యం ఉన్నవాడే క్రమంగా ముందుకు సాగగలడు. నిర్దిష్ట లక్ష్యం లేకుండా జీవించడం అత్యంత ప్రమాదకరం, అది జీవితాన్ని వ్యర్థంగా మార్చేస్తుంది.
వివరాలు
2. చెడు అలవాట్ల వల్ల నాశనం తప్పదు
చెడు అలవాట్లకు లోనవడం వల్ల వ్యక్తిగతంగా కాకుండా కుటుంబం మొత్తంగా నష్టపోతుంది. అబద్ధాలు చెప్పడం,మత్తు పదార్థాలు వాడటం,డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయడం వంటివి వ్యక్తిని మానసికంగా,ఆర్థికంగా క్షీణింపజేస్తాయి. అలాంటి అలవాట్లను విస్మరించాలి. అలాగే చెడు స్నేహితుల సంఘంలో ఉండకపోవడమే మంచిది.
వివరాలు
3. దానం అవసరం.. అది సంపదకే కాదు,సంతృప్తికీ మార్గం
డబ్బు సంపాదించడం ప్రతి ఒక్కరికీ అవసరం. కానీ మన చుట్టూ ఉన్న పేద, అనాథలు, నిస్సహాయుల పరిస్థితిని కూడా మనం పట్టించుకోవాలి. వారికి సహాయం చేయడం మన సామాజిక బాధ్యత. ఆహారం, దుస్తులు వంటి అవసరాలను తీర్చలేని వారి కోసం చేయబడే సహాయం,దాతృత్వం మనకు మనసులో ఓ తృప్తిని ఇస్తుంది. దానం చేయని ధనం నిలవదు అని చాణక్యుడు హెచ్చరిస్తాడు.
వివరాలు
4. సమయం విలువను గుర్తించకపోతే విజయానికి దూరం
చాణక్యుని ప్రకారం,సమయాన్ని నిర్లక్ష్యం చేసిన వారు ఎన్నడూ విజయాన్ని పొందలేరు. వారు ఎన్నిసార్లు శ్రమించినా ఫలితం రాదు. సమయం ఒకసారి పోయిన తర్వాత తిరిగి రాదు. కనుక దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ, ప్రతీ క్షణాన్ని విలువైనదిగా మార్చుకోవాలి.
వివరాలు
5. స్త్రీలు,పెద్దల గౌరవం జీవితానికి మంగళకరం
చాణక్యుని దృష్టిలో స్త్రీలు,వృద్ధులు అత్యంత గౌరవించదగినవారు. వారిని అవమానించేవారి ఇంట్లో లక్ష్మిదేవి నివసించదని ఆయన అంటాడు. తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వని వారు,ఇంట్లో గొడవలు పెట్టే వారు సంపదను కోల్పోతారు. వారి జీవితంలో శాంతి,ఆనందం అనేవి కనబడవు. ఈ ఐదు విషయాలు ఆచరణలో పెట్టగలిగితే,జీవితం అభివృద్ధి బాటలో సాగుతుంది. చాణక్యుని సూక్తులు ఇప్పటికీ చాలామందికి మార్గదర్శకంగా ఉన్నాయి. మనల్ని మనం విశ్లేషించుకుని,ఈ తప్పులనుంచి దూరంగా ఉంటే,విజయాన్ని చేరుకోవడం అసాధ్యం కాదు. కనుక ఒక్కసారి చాణక్యుని నీతులను గమనించి, జీవితానికి అర్థం చెప్పే మార్గాన్ని ఎంచుకోండి.