Kachidi Fish : కచిడి చేప ఖరీదు ఎంతో తెలుసా.. దీని బదులు ఒక మారుతి కారు కొనొచ్చు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి అరుదైన చేప సముద్రంలో గంగపుత్రులకు చిక్కింది. గోల్డెన్ ఫిష్‌గా పిలిచే ఈ కచిడి చేప (Kachidi Fish) సోమవారం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో మత్స్యకారులకు చిక్కింది. అయితే ఈ చేపను కొనుగోలు చేసేందుకు స్థానిక వ్యాపారులు తీవ్రంగా పోటీ పడటం గమనార్హం. ఇదే సమయంలో పూడిమడకకు చెందిన మత్స్యకారుడు, చేపల వ్యాపారి మేరుగు కొండయ్య దీన్ని భారీ ధరకు దక్కించుకున్నారు. ఈ మేరకు రూ.3.90 లక్షలకు సొంతం చేసుకుని రికార్డు సృష్టించారు. సముద్రంలో దొరికిన ఈ మీనం 27కేజీల బరువు ఉందని కొనుగోలుదారుడు మేరుగు కొండయ్య చెప్పారు. ఈ చేపకు మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉంటుందని, ఇది వలలో పడితే గంగపుత్రులకు కాసుల పంటేనని అంటుంటారు.
ఔషధ గుణాల్లోనూ మేటి ఈ గోల్డెన్ ఫిష్
ఈ బంగారు చేపలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని స్థానిక గంగపుత్రులు అంటున్నారు. శస్త్రచికిత్స చేసిన తర్వాత కుట్లు వేసే దారాన్ని ఈ చేప గాల్ బ్లాడర్‌తోనే తయారు అవుతాయని పేర్కొన్నారు. మందుల తయారీలోనూ దీని భాగాలను వినియోగిస్తారని వెల్లడించారు. ఈ చేప పొట్టలోని తిత్తులు ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. అంతేకాదు ఖరీదైన వైన్ తయారీలోనూ చేప శరీర భాగాలను ఉపయోగిస్తారు. మార్కెట్‌లో భారీ ధర పలుకుతున్న ఈ చేపను ప్రొటోలిసియా డయాకాన్సన్ అనే సాంకేతిక నామంతో పిలుస్తారు. కచిడి ఓ చోట స్థిరంగా ఉండదు. ఎప్పుడూ ఒక చోట నుంచి మరో చోటికి ప్రయాణిస్తూనే ఉంటుంది. ఇది ఎప్పుడు మత్స్యకారుల వలకు చిక్కినా కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఎగబడతారు.