Bathukamma: మొదలైన బతుకమ్మ పండుగ.. తొలి మూడ్రోజులు జరిగే సంప్రదాయాల గురించి తెలుసుకోండి
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే పండుగ 'బతుకమ్మ' ప్రకృతిని ఆరాధిస్తూ, ఆనందం పంచుకుంటూ జరుపుకునే ఈ పండుగలో చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరూ కలిసి ఆనందంగా ఆడిపాడతారు. రంగురంగుల పూలతో తెలంగాణ గ్రామాలు మరింత శోభాయమానంగా మారతాయి. తెలుగులో 'బతుకు' అంటే జీవితం, 'అమ్మ' అంటే తల్లి. ఈ రెండు పదాల మిశ్రమమే బతుకమ్మ పండగ. ఈ పండుగ మహాలయ అమావాస్య లేదా భాద్రపద అమావాస్యనాడే ప్రారంభమవుతుంది. దీనిని 'పేత్ర అమావాస్య' అని కూడా అంటారు.
ఎంగిలిపూల బతుకమ్మ
పండుగ తొలి రోజును 'ఎంగిలిపూల బతుకమ్మ' అంటారు. ఈ రోజు, మహిళలు ముందుగా పూలను సేకరించి, వాటితో బతుకమ్మను పేర్చుతారు. గునుగు, తంగేడు, బంతి వంటి పూలతో బతుకమ్మను అంగరంగ వైభవంగా అలంకరిస్తారు. పూలు ముందుగానే సేకరించి, వాటిని మరుసటి రోజు పూజలో ఉపయోగించడం వల్ల బతుకమ్మకు 'ఎంగిలిపూల బతుకమ్మ' అని పేరు వచ్చింది. ఈ పండుగలో ముఖ్యంగా మహిళలు సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబై, బతుకమ్మను పూజించి, జానపద గీతాలను ఆలపిస్తారు. సాయంత్రం సమయానికి సమీపంలోని చెరువులు, గంగమ్మ ఆలయాల వద్ద గుమిగూడి బతుకమ్మను ఆడిపాడి, సంబరాలు నిర్వహిస్తారు.
అటుకుల బతుకమ్మ
రెండో రోజు 'అటుకుల బతుకమ్మ'గా అమ్మవారిని పూజిస్తారు. బతుకమ్మను పేర్చడానికి అవసరమైన పూలకోసం ఉదయాన్నే అడవికి వెళ్లి తంగేడు, గునుగు, బంతి, చామంతి, అడవి గడ్డి పూలు తీసుకొస్తారు. ఈ పూలను రెండు ఎత్తులలో గౌరమ్మను పేర్చి, ఆడవారు అందరూ కలసి ఆడుకొని సాయంత్రం చెరువులలో నిమజ్జనం చేస్తారు. ఇక నైవేధ్యంగా సప్పిడి పప్పు, బెల్లం, అటుకులు సమర్పిస్తారు.
ముద్దపప్పు బతుకమ్మ
ఇక బతుకమ్మ పండుగలో మూడోరోజు 'ముద్దపప్పు బతుకమ్మ'గా అమ్మవారిని పూజిస్తారు. మూడంతరాలలో చామంతి, మందార, సీతమ్మజడ, రామబాణం పూలతో బతుకమ్మను చేసి.. తామర పాత్రల్లో అందంగా అలంకరిస్తారు. శిఖరంపై గౌరమ్మను ఉంచి ఉదయం పూజలు చేసి సాయంత్రం అందరూ కలసి 'బతుకమ్మ' ఆడతారు. అనంతరం చెరువులో నిమజ్జనం చేస్తారు. మరోవైపు మూడోరోజు వాయనంగా సత్తుపిండి, పెసర్లు, చక్కర, బెల్లం కలిపి పెడతారు.