Navratri 2024: నవరాత్రులను ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా.. ఈ టైమ్‌లో కొన్ని బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ ఇవే..!
మన దేశంలో ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక ఆచారాలు, సంప్రదాయాలు ఉంటాయి. విభిన్న వ్యక్తులు, వివిధ అలవాట్లు ఉండడం వల్ల భారతదేశాన్ని సందర్శించేందుకు అందరిలో ఆసక్తి ఉంటుంది. సీజన్‌ను బట్టి భారత్‌లో ఏదైనా ప్రాంతాన్ని ఆనందించవచ్చు. ఈ కారణంగా దేశంలోని పర్యాటక ప్రాంతాలు ఎప్పుడూ ప్రయాణికులతో కిటకిటలాడుతుంటాయి. వర్షాలు కురిసిన తర్వాత ఈ ప్రాంతాల్లో వాతావరణం మరింత హాయిగా మారుతుంది. అయితే, చలికాలంలో ఈ ప్రాంతాలను సందర్శించడం కొంచెం కష్టతరమే. అందువల్ల, చలికాలం వచ్చే ముందు దసరా, శరన్నవరాత్రి పండుగలు ఎక్కడ ఘనంగా జరుగుతున్నాయో చూసి, వేడుకలు ఆస్వాదించడానికి వచ్చేయండి...
దుర్గా పూజ, పశ్చిమ బెంగాల్
భారతదేశంలో దసరా ఉత్సవాలంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే నగరం కోల్‌కతా. ఈ నగరంలో దేవి నవరాత్రుల పూజలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతాయి. పశ్చిమ బంగాల్‌లో ప్రతి ప్రాంతం దుర్గామాతను విభిన్న రీతిలో ప్రతిష్టించి పూజలు చేస్తుంది. దసరా సమయంలో కోల్‌కతా మొత్తం పండుగ వాతావరణంతో నిండిపోతుంది. ఇక్కడి ఆచారాలు, సంప్రదాయాలు యాత్రికులను బాగా ఆకర్షిస్తాయి. కాబట్టి ఈ నవరాత్రుల్లో మీరు ట్రిప్ ప్లాన్ చేస్తే, కోల్‌కతా వెళ్లి శరన్నవరాత్రులను ఆస్వాదించి, అమ్మవారి ఆశీస్సులు పొందవచ్చు.
రామ్‌లీలా మైదానం ఢిల్లీ
దసరా వేడుకలు దిల్లీ రామ్‌లీలా మైదానంలో అత్యంత వైభవంగా జరుగుతాయి. నవరాత్రి సమయంలో 9 రోజుల పాటు రంగస్థల నటులు రామాయణం కథలను నాటకాల రూపంలో ప్రదర్శిస్తారు. దసరా రోజున ఈ మైదానంలో భారీ రావణాసురుడి బొమ్మను దహనం చేసి, ఉత్సాహంగా సంబరాలు నిర్వహిస్తారు. ఈ అద్భుత కార్యక్రమాన్ని చూడడానికి దేశం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలి వస్తారు.
మైసూర్ దసరా వేడుకలు..
కోల్‌కతా తర్వాత దసరా వేడుకలు చూసేందుకు మైసూరు వెళ్లడం అనివార్యం. ఇక్కడి వడియార్ రాజ వంశస్థులు దశాబ్దాలుగా ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రుల సమయంలో మైసూరు నగరాన్ని అత్యంత సుందరంగా అలంకరిస్తారు. ఈ సందర్భంగా వివిధ కళాకారుల ప్రదర్శనలు, పోటీలు నిర్వహిస్తూ ఈ వేడుకలను మరింత ఉత్సాహంగా చేస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల నుంచి కూడా పర్యాటకులు భారీ సంఖ్యలో ఈ వేడుకలను చూసేందుకు వచ్చేస్తారు.
కోట దసరా మేళా, రాజస్థాన్
రాజస్థాన్‌లోని కోట దసరా వేడుకలు ప్రసిద్ధి పొందాయి. దసరా పండుగ రోజున, ఉదయం రాజభవనంలో మతపరమైన కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అనంతరం, రాజ కుటుంబ సభ్యులు ఊరేగింపు నడుమ జాతర మైదానానికి చేరుకుంటారు. ఈ వేడుకలో రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథల బొమ్మలు ఉంచి, వాటిని దహనం చేయడం ద్వారా ఉత్సవాలను ప్రారంభిస్తారు. ఈ దహనంలో పటాకులు పేలడం, చూస్తే కన్నులవిందుగా ఉంటుంది. అనంతరం, స్థానిక హస్తకళలతో జాతర కొనసాగుతుంది.
బతుకమ్మ, తెలంగాణ
తెలంగాణలో జరిగే బతుకమ్మ వేడుకలు ప్రత్యేకమైనవే. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పూల పూజ చేయడం ఈ వేడుకల విశేషం. ప్రతి రోజూ ఒక ప్రత్యేక రకమైన బతుకమ్మను ఆవిష్కరిస్తారు. ఆడపడుచులు ఈ సందర్భంగా ఆనందంగా జరుపుకుంటారు. నాట్యం,పాటలతో వేడుక జరుగుతుంది. చివరి రోజు, సద్దుల బతుకమ్మ నిర్వహించబడుతుంది. చివరగా, బతుకమ్మను చెరువుల్లో నిమజ్జనం చేస్తారు.
బస్తర్ దసరా, ఛత్తీస్‌గఢ్
ఛత్తీస్‌గఢ్ లో దీనిని బస్తర్ దసరా అని పిలుస్తారు. ఈ పండుగను రాముడు రావణుడిని ఓడించిన కథకు మాత్రమే పరిమితం చేయరు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలోని గిరిజనుల రక్షక దేవతగా పరిగణించే దంతేశ్వరి దేవిని గౌరవించే 75 రోజుల ఈ పండుగ, ఇతర దైవాలతో కలిసి నిర్వహించబడుతుంది. ఈ పండుగ 15వ శతాబ్దానికి చెందిన కాకతీయ రాజవంశానికి చెందిన రాజు పురుషోత్తం దేవు ప్రారంభించినట్లు చెప్పబడింది, అది ఒడిశాలోని పూరీ తీర్థయాత్ర నుండి తిరిగి వచ్చినప్పుడు ప్రారంభించబడిందట. బస్తర్ దసరాలో రథ ఊరేగింపులు, వివిధ దేవతల సందర్శన, గిరిజన పెద్దల సమావేశాలు, కృతజ్ఞతా వేడుకలు వంటి అనేక ఆచారాలు ఉంటాయి.
కులు దసరా, హిమాచల్ ప్రదేశ్
హిమాచల్ ప్రదేశ్‌లో దసరా పండుగ సందర్భంగా, మనాలికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న కులు పట్టణంలో అద్భుతంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాంతంలోని ప్రధాన దేవతలు రఘునాథుని దర్శించడానికి ఇక్కడ చేరుకుంటారు. ఈ ప్రత్యేక పండుగ దసరా రోజున ప్రారంభమై, ఏడు రోజుల పాటు కొనసాగుతుంది. దేవతలను పల్లకీలలో కులుకు తీసుకువస్తారు.
బరారా, హర్యానా
బరారా, హర్యానాలో ఎక్కువగా తెలియని పట్టణం. అయితే, దసరా సమయంలో ఈ పేరు తరచూ వినిపిస్తుంది. ఈ పట్టణంలో ఎత్తైన రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయడం ద్వారా, బరారా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ప్రత్యేక స్థానం పొందింది. మీరు దసరా ఉత్సవాలను చూడాలనుకుంటే, బరారా తప్పనిసరిగా సందర్శించాల్సిన ప్రదేశం.