
Tollywood : టాలీవుడ్ పైరసీ గుట్టు రట్టు.. కీలక వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు..
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలలో పైరసీ ప్రధానమైనదిగా మారింది. పైరసీ వల్ల అనేక సినిమాలు తీవ్రంగా నష్టపోయాయి. సినిమా థియేటర్లలో విడుదలైన అదే రోజునే, ఫుల్ సినిమాలు ఇంటర్నెట్‌లో లీక్ అవుతూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కొంతమంది వ్యక్తులు థియేటర్లలోనే సినిమాలను గుట్టుగా షూట్ చేసి, అవి పైరసీ నెట్‌వర్కులకు డబ్బుల కోసం విక్రయిస్తున్న సందర్భాలు పెరిగిపోతున్నాయి. పైరసీపై సినీ ప్రముఖులు నిరంతరం పోరాటం చేస్తున్నప్పటికీ, ఈ సమస్య తీవ్రతరమవుతోంది. ఇటీవలి కాలంలో పైరసీ మరింత ఉద్ధృతంగా వెలుగులోకి వచ్చింది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన 'గేమ్ ఛేంజర్' నుండి తాజా సినిమా 'కన్నప్ప' వరకు పలు చిత్రాలు పైరసీ బారిన పడ్డాయి. ఇది టాలీవుడ్‌ను ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతీసింది.
వివరాలు
పరిశ్రమకు రూ.3,700 కోట్ల మేర నష్టం
ఈ నేపథ్యంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పైరసీ ముఠా గుట్టును ఛేదించారు. ఓ కీలక వ్యక్తిని అరెస్ట్ చేయడం ద్వారా వారు ఈ కేసులో ప్రగతిని సాధించారు. ఇటీవల తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సైబర్ క్రైమ్ విభాగానికి పిర్యాదు చేస్తూ,పైరసీ కారణంగా పరిశ్రమకు సుమారు రూ.3,700 కోట్లు నష్టం వాటిల్లిందని పేర్కొంది. అభియోగాల ప్రకారం,తూర్పు గోదావరి జిల్లాకు చెందిన జన కిరణ్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈయన సినిమా విడుదలైన రోజే హై డెఫినిషన్ (HD) వెర్షన్‌ను పైరసీ చేసి,ఇంటర్నెట్‌లో పోస్ట్ చేస్తున్నాడని గుర్తించారు. కేవలం 2024 సంవత్సరంలో మాత్రమే పరిశ్రమకు రూ.3,700 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తెలిపింది.
వివరాలు
దాదాపు 65 సినిమాలు పైరసీ
జన కిరణ్ కుమార్‌పై 1957 కాపీరైట్ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ (IT Act)తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఇప్పటివరకు ఈయన దాదాపు 65 సినిమాలు పైరసీ చేసినట్లు విచారణలో వెల్లడైంది. పైరసీ చేసి, చిన్న సినిమాలను సుమారు రూ.32,000కి, పెద్ద సినిమాలను రూ.80,000కి సంబంధిత వెబ్‌సైట్లకు విక్రయిస్తున్నాడని సమాచారం.