Dhanteras 2024 date: ధనత్రయోదశి ఎప్పుడు, పూజా విధానం, కొనడానికి అనుకూలమైన సమయం, ఏమి కొనాలి?
హిందూ మత విశ్వాసాల ప్రకారం, ప్రతి సంవత్సరం దీపావళికి ముందుగా జరుపుకునే ధన త్రయోదశి పండుగ దీపావళి ప్రారంభానికి సంకేతం. ఐదు రోజుల పాటు జరుపుకునే ఈ పండుగ,భాయ్ దూజ్‌తో ముగుస్తుంది. పురాణాల ప్రకారం,ధన త్రయోదశి రోజున ఆయుర్వేద వైద్య పితామహుడు ధన్వంతరిని, లక్ష్మీదేవిని, కుభేరుడిని పూజిస్తారు. ఈపవిత్ర రోజున బంగారం,వెండి,ఇతర విలువైన వస్తువులను కొనుగోలు చేయడం పరిపాటి. ఈరోజు ఏ వస్తువు కొన్నా లేదా ఏ శుభకార్యం చేసినా,అది మన జీవితంలో రెట్టింపు లాభాలను అందిస్తుందని చాలా మంది నమ్ముతారు. ఈరోజు ధన్వంతరిని ఆరాధించడం వల్ల ఆరోగ్యవంతంగా,శక్తివంతంగా ఉండవచ్చని వారు నమ్ముతారు. ఈ సందర్భంగా,ఈ ఏడాది ధన త్రయోదశి ఎప్పుడు జరుగుతుందో,ఏ సమయంలో పూజలు చేయాలో, ధన త్రయోదశి ప్రాముఖ్యతను తెలుసుకుందాం.
ధన త్రయోదశి ఎప్పుడంటే..
హిందూ పంచాంగం ప్రకారం, 2024 సంవత్సరంలో ధనత్రయోదశి పండుగ ఈ సంవత్సరం త్రయోదశి తిథి అక్టోబర్ 29న ఉదయం 12:01 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 30న తెల్లవారుజామున 2:45 గంటలకు ముగుస్తుంది. అక్టోబర్ 29న రాత్రి 7:27 నుండి 9:16 వరకు ధన్తేరస్ పూజకు అనుకూలమైన సమయం ఉంటుంది. ప్రదోష కాలము 6:37 PM నుండి 9:16 PM వరకు జరుగుతుంది. ఉదయం తిథి ప్రకారం, మంగళవారం 29 అక్టోబర్ 2024 న ధన త్రయోదశి పండుగ జరుపుకుంటారు. ప్రదోష కాలంలో ధన్వంతరిని పూజించడంతో పాటు దీపాలను వెలిగిస్తారు. అలాగే తమ సామర్థ్యం ప్రకారం దానధర్మాలు చేస్తారు.
ధన త్రయోదశి ప్రాముఖ్యత
పురాణాల ప్రకారం, సాగర మథన సమయంలో అశ్విని మాసంలో క్రిష్ణ పక్షంలో ధన్వంతరి తన రెండు చేతుల్లో అమృత భాండం. మరో చేతిలో ఆయుర్వేద గ్రంధంతో ఆవిర్భవించాడు. కాబట్టి, ఈ రోజున ధన్వంతరికి ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. ధనతేరాస్ రోజున, సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి, కోశాధికారి కుభేరుడిని, ధన్వంతరిని పూజిస్తారు. ఈ పవిత్ర రోజున ఇంట్లో పూజలు చేయడం ద్వారా డబ్బుకు ఎలాంటి లోటు ఉండదని అనుకుంటారు.
ధన్వంతరి జయంతి
ధనతేరాస్ రోజున, చాలా మంది బంగారం, వెండి పాత్రలు, చీపురు వంటి వస్తువులను కొనడం శుభప్రదంగా భావిస్తారు. ధనత్రయోదశి వేళ షాపింగ్ చేయడం వల్ల తమ సంపద రెట్టింపు అవుతుందని వారు నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున వాహనాలు, భూమి, ఆస్తి తదితర వాటిపై ఒప్పందాలు కూడా చేసుకోవచ్చు. 'ధన్‌తేరాస్' అనే పదం 'ధన్' ,'తేరాస్' అని పదాలతో ఏర్పడింది.అంటే పదమూడు రెట్ల సంపద అని అర్థం. ధన్వంతరి భగవానుడు కూడా ఈ రోజున దర్శనమివ్వడం వలన ఈ రోజున ధన్వంతరి జయంతి జరుపుకుంటారు.