Dussehra 2024: సర్వరోగ నివారిణి జమ్మి.. ఈ చెట్టు ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!
ఈ భూమిపై ఉన్న చెట్లు మనకు ఏదో ఒక రకంగా ఉపయోగపడుతూనే ఉంటాయి. వాటిలో కొన్ని చెట్లకు మనం పూజలు కూడా చేస్తాం. అలాంటి చెట్లలో జమ్మి చెట్టు ఒకటి. దేవతా వృక్షాల్లో జమ్మి చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. మన పురాణాల్లో కూడా జమ్మి చెట్టు ప్రస్తావన ఉంది. చాలామంది భక్తులు జమ్మి చెట్టు పాపాలను పోగొడుతుందని, శత్రువులను నాశనం చేస్తుందని నమ్ముతారు. పండితులు కూడా ఇదే చెబుతారు. శ్రీరాముడు రావణాసురుడిపై యుద్ధానికి వెళ్లే ముందు జమ్మి చెట్టుకు పూజ చేసి విజయం సాధించాడని అంటారు. అందువల్ల దశమి రోజు జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేస్తారు.
జమ్మి చెట్టు వద్ద పాండవుల ఆయుధాలు
అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు పాండవులు ఆయుధాలను జమ్మి చెట్టు వద్ద ఉంచి,తాము తిరిగి వచ్చే వరకు వాటిని కాపాడమని మొక్కి వెళ్తారు. అజ్ఞాతవాసం పూర్తైన తర్వాత విజయదశమి రోజున ఆయుధాలను తీసుకొని కౌరవులపై యుద్ధం చేసి విజయం సాధిస్తారు. అప్పటి నుండి ఇప్పటికీ విజయదశమి రోజున జమ్మిచెట్టుకు పూజలు చేస్తూనే ఉన్నాం.ఆరోజు జమ్మి చెట్టుకు పూజ చేసి,చెట్టు ఆకులను పెద్దలకు అందించి ఆశీర్వాదాలు తీసుకుంటారు. జమ్మి చెట్టుకు పూజలు చేయడం వల్ల అన్ని పనుల్లో విజయం కలుగుతుందని చాలా మంది నమ్మకం. అలాగే వినాయకచవితి రోజున పత్రి పూజలో కూడా జమ్మి చెట్టు ఆకులను ఉపయోగిస్తారు. జమ్మిచెట్టును హోమంలో కూడా ఉపయోగిస్తారు.ఈ చెట్టు మనకు విజయం మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది.
జమ్మి చెట్టు ఆరోగ్య ప్రయోజనాలు
ఆయుర్వేదంలో జమ్మి చెట్టును అనారోగ్య సమస్యలను తగ్గించే ఔషధంగా ఉపయోగిస్తారు. జమ్మి చెట్టు ప్రతి భాగంలో ఔషధ గుణాలు ఉంటాయి. జమ్మి చెట్టువల్ల వచ్చే గాలి చాలా మంచిదని, ఆ గాలి పీల్చడం వలన అనేక రోగాలు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతారు. జమ్మి ఆకుల పసరును కుష్టు వ్యాధి నయం చేయడానికి ఉపయోగిస్తారు. జమ్మి చెట్టు బెరడు, మిరియాలు కలిపి మాత్రలు తయారు చేసి, మజ్జిగతో తీసుకుంటే అతిసారం తగ్గుతుంది. అలాగే, ఈ ఆకుల పసరును రాసుకుంటే అవాంఛిత రోమాలు తొలగిపోతాయి. బెరడుతో తయారుచేసిన గంధాన్ని విషం కుట్టిన చోట రాస్తే, విష ప్రభావం తగ్గుతుంది.
జమ్మితో కళ్ల సమస్యలు తగ్గుతాయి
ఎండిన జమ్మి ఆకులను కాల్చగా వచ్చే పొగను కళ్లకు చూపిస్తే కళ్ల సమస్యలు తగ్గుతాయి. ఎక్కడైతే ఈ చెట్టు పెరుగుతుందో అక్కడ భూమిలో నీరు పుష్కలంగా ఉంటుంది. ఎండిన ఆకులను భూమిలో కలిపి దున్నితే భూమి సారవంతమవుతుంది. ఈ విధంగా జమ్మి చెట్టు మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది, రైతులకు కూడా మంచి సహాయాన్ని అందిస్తుంది.