
Health Tips: రోజూ ప్రోటీన్ ఫుడ్స్ తింటే ఈ ఆరోగ్య సమస్యలు మాయం!
ఈ వార్తాకథనం ఏంటి
శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలలో ప్రోటీన్ ఒకటి. ఇది ఎముకలు, కండరాలకు బలాన్ని అందించడంతో పాటు చర్మం, జుట్టు, ఇతర అవయవాలకు కూడా ఎంతో మేలు చేస్తుంది.
కొత్త కణాల నిర్మాణానికి, రోగనిరోధక శక్తిని పెంచేందుకు ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. ప్రోటీన్ లోపం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.
కండరాల బలహీనత, జుట్టు రాలడం, చర్మం పొడిబారడం, అలసట మొదలైన లక్షణాలు ప్రోటీన్ తక్కువగా ఉండే వారి వద్ద ఎక్కువగా కనిపిస్తాయి.
అందుకే ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Details
ప్రోటీన్ లోపం వల్ల వచ్చే సమస్యలు
ప్రోటీన్ తక్కువగా ఉండటం శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కండరాల నిర్మాణంలో ఇది కీలకమైన పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు.
దీని లోపం వల్ల కండరాలు బలహీనంగా మారతాయి. శరీరానికి సరైన శక్తి అందకపోవడంతో అలసట ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ప్రోటీన్ తక్కువగా ఉండటం వల్ల జుట్టు బలహీనంగా మారి ఎక్కువగా రాలుతుంది.
చర్మం ముడతలు పడటంతో పాటు నిస్తేజంగా మారుతుంది. రోగనిరోధక వ్యవస్థ బలహీనపడటంతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
ప్రోటీన్ గ్రెలిన్, లెప్టిన్ అనే హార్మోన్లను నియంత్రించడం ద్వారా ఆకలిని సరిచేయడంలో సాయపడుతుంది.
Details
ప్రోటీన్ లభించే ఉత్తమమైన ఆహార పదార్థాలు
గుడ్లు
కాల్షియంతో పాటు ప్రోటీన్ సమృద్ధిగా ఉండే గుడ్లను ఉదయం అల్పాహారంగా తీసుకుంటే ప్రోటీన్ లోపాన్ని తగ్గించుకోవచ్చు.
పాల ఉత్పత్తులు
పాలు, జున్ను, పెరుగు వంటి డైరీ ఉత్పత్తుల్లో అధికంగా ప్రోటీన్ ఉంటుంది. ఒక కప్పు పాలలో దాదాపు 8 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది.
ప్రోటీన్ రిచ్ కాయధాన్యాలు
సోయాబీన్, శనగలు, కిడ్నీ బీన్స్ వంటి ఆహార పదార్థాలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ప్రోటీన్ లోపాన్ని అధిగమించవచ్చు.
పప్పులు
రోజూ ఒక కప్పు పప్పుదినుసులు తీసుకుంటే శరీరానికి అవసరమైన ప్రోటీన్ అందుతుంది.
Details
గింజలు
జీడిపప్పు, బాదం, పిస్తా వంటి గింజల్లో కూడా అధికంగా ప్రోటీన్ ఉంటుంది. ప్రతి ఉదయం వీటిని తినడం ద్వారా శరీరంలోని ప్రోటీన్ లోపాన్ని తక్కువ చేసుకోవచ్చు.
ప్రోటీన్ సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
రోజువారీ డైట్‌లో ప్రోటీన్‌ను సమతుల్యతగా చేర్చుకోవడం శరీరానికి కావాల్సిన శక్తిని అందించేందుకు సాయపడుతుంది.