Page Loader
Hemoglobin foods: రక్తం తక్కువగా ఉందా.. అయితే ఇవి తినండి..!
రక్తం తక్కువగా ఉందా.. అయితే ఇవి తినండి..!

Hemoglobin foods: రక్తం తక్కువగా ఉందా.. అయితే ఇవి తినండి..!

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 05, 2024
11:20 am

ఈ వార్తాకథనం ఏంటి

మనిషి ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైన అంశాల్లో రక్తం ఒకటి. రక్తం సక్రమంగా ఉంటే మన శరీరంలో వ్యాధులు ఎక్కువగా దరి చేరవు. శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను అందించే పని రక్తమే చేస్తుంది. ముఖ్యంగా గుండె నుండి ఇతర అవయవాలకు ఆక్సిజన్ చేరవడంలో హిమోగ్లోబిన్‌ పాత్ర కీలకమైనది. ఎర్ర రక్త కణాలలో ఉండే ఈ ప్రోటీన్ వల్లే రక్తం ఎర్రగా కనిపిస్తుంది. ఇది శరీరంలోని అన్ని అవయవాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేయడానికి ముఖ్యమైనది. అందుకే హిమోగ్లోబిన్‌ స్థాయి ఆరోగ్యాన్ని గుర్తించే ముఖ్యమైన అంశం. అనారోగ్యంతో వైద్యుడిని సంప్రదించినప్పుడు, రక్త పరీక్షలో గమనించే ప్రధాన అంశం కూడా హిమోగ్లోబిన్‌ స్థాయిలే.

వివరాలు 

ఐరన్‌ స్థాయిలు తగ్గితే.. హిమోగ్లోబిన్‌ కూడా తగ్గుతుంది  

హిమోగ్లోబిన్‌ స్థాయిలు తగ్గితే, రక్తహీనత (అనemia) సమస్య ఏర్పడుతుంది. అలసట, బలహీనత, తల తిరగడం వంటి లక్షణాలు రక్తహీనత వల్ల వస్తాయి. శరీరంలో ఐరన్‌ స్థాయిలు తగ్గినప్పుడు హిమోగ్లోబిన్‌ స్థాయిలు కూడా తగ్గిపోతాయి. ఈ సమస్య నివారించడానికి, శరీరంలో ఐరన్‌, హిమోగ్లోబిన్‌ స్థాయిలను పెంచడానికి కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం అవసరం. శరీరంలో హిమోగ్లోబిన్‌ స్థాయిలను నిలబెట్టుకోవడానికి ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ B12 ముఖ్యమైనవి. ఆహారంలో పాలకూర, బ్రోకలీ, బఠానీలు, గ్రీన్‌ బీన్స్‌ వంటి ఆకుకూరలను చేర్చుకోవడం మంచిది. వీటి ద్వారా రక్తం పెరిగే అవకాశం ఉంది.

వివరాలు 

ఐరన్‌ సమర్థవంతంగా లభించేందుకు విటమిన్‌ C

విటమిన్‌ B12 అధికంగా లభించే ఆహారాలు మాంసం, చేప, గుడ్డు, పాలు. వీటి ఉపయోగం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక, రెగ్యులర్‌ డైట్‌లో పాలకూర, బీట్‌రూట్‌, ధనియాలు, ఆపిల్‌, గుడ్డు వంటి ఆహారాలను తీసుకోవడం రక్తహీనత నివారణకు సహాయపడుతుంది. అలాగే, చిక్కుళ్ళు, గింజలు, ఎండుద్రాక్ష, ఖర్జూరాలు కూడా ఐరన్‌ పుష్కలంగా ఉండే ఆహారాలు. శరీరానికి ఐరన్‌ సమర్థవంతంగా లభించేందుకు విటమిన్‌ C కూడా ఉపయోగపడుతుంది. అందుకే నారింజ, నిమ్మ, కివి, బెర్రీలు వంటి వాటిని తప్పకుండా తీసుకోవాలి.

వివరాలు 

యోగ, మెడిటేషన్‌ వంటి వాటిని అలవాటు చేసుకోవాలి 

ఆహారంతో పాటు, జీవనశైలిలో కొన్ని మార్పులు కూడా అవసరం. దినచర్యలో ప్రతిరోజూ కొంత సమయం వ్యాయామం చేయడం అలవాటుగా మార్చుకోవాలి. మంచి నిద్ర కూడా ఆరోగ్యానికి చాలా ముఖ్యం. పచ్చటి చెట్లు ఉన్న ప్రదేశాలలో కొద్దిసేపు గడపడం, వాకింగ్‌ అలవాటు చేసుకోవడం మంచిది. యోగ, మెడిటేషన్‌ వంటి వాటిని అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు.