Friendship Day: ఎన్నో రోజులుగా దూరమైన స్నేహితులను తిరిగి కలుసుకోవాలనుకుంటే చేయాల్సిన పనులు
వయసు పెరుగుతున్న కొద్దీ చిన్నప్పటి స్నేహాలు దూరమైపోతుంటాయి. అలాగే కొన్నిసార్లు అనవసర గొడవల కారణంగా కూడా అప్పటివరకూ ఎంతో స్నేహంగా ఉన్నవారు దూరమైపోతారు. ఈ దూరం ఒక్కోసారి రోజులు, సంవత్సరాలు, దశాబ్దాలు కూడా ఉంటుంది. అయితే మీ పాత స్నేహితులను కలవాలన్న కోరిక మీలో ఉందా? తిరిగి మీ స్నేహాన్ని వారితో కొనసాగించాలని మీకుందా? అయితే ఇది చదవండి. కనీసం ఫోన్లో కూడా టచ్ లేని స్నేహితుడిని డైరెక్టుగా ఎలా కలుసుకోవాలో, ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇలాంటప్పుడే కొన్ని విషయాలు తెలుసుకోవాలి. గతాన్ని గుర్తు చేసుకోండి: మీ స్నేహితుడితో గడిపిన క్షణాలను ఒకసారి గుర్తు చేసుకోండి. అసలు మీరిద్దరూ ఎందుకు విడిపోయారో ఆలోచించండి.
బంధాన్ని బలోపేతం చేసే క్షమాపణ
ఒకవేళ గతంలో మీ స్నేహితుడి విషయంలో మీరేదైనా తప్పు చేస్తే క్షమించమని మీ స్నేహితుడిని అడగండి. ఒకవేళ అవతలి వారు తప్పు చేసినా క్షమించేసేయండి. క్షమాపణ వల్ల మీ స్నేహితుడితో మీ బంధం పెరుగుతుంది. ఫోన్లో కనెక్ట్ అవ్వండి: ముందుగా మీ స్నేహితుడికి మెసేజ్ గానీ, కాల్ గానీ చేయండి. హాయ్ ఎలా ఉన్నావ్ అని పంపడం ఇబ్బందిగా ఉంటుంది కావచ్చు, కానీ ఫర్వాలేదు పంపండి. మెసేజ్ పంపడం ఇష్టం లేకపోతే, మీరు మీ ఫ్రెండ్ కలిసి దిగిన ఫోటోను పంపి గత జ్ఞాపకాలను గుర్తు చేయండి. వ్యక్తిగతంగా కలుసుకోండి: ఫోన్లో సంభాషణ కుదిరిన తర్వాత వ్యక్తిగతంగా మీ స్నేహితుడిని ఒకసారి కలవండి. వ్యక్తిగతంగా కలిస్తే బంధం మరింత బలపడుతుంది.
కలిసి కాఫీకి వెళ్ళండి:
వ్యక్తిగతంగా కలిసిన తర్వాత కబుర్లు చెప్పుకోవడానికి కాఫీకి వెళ్ళండి. వీలైతే లంచ్, డిన్నర్ అయినా బాగుంటుంది. దీనివల్ల మీ పాత స్నేహితులతో బంధం బలపడుతుంది. అవతలి వాళ్ళ మంచి చెడ్డలు తెలుసుకోండి. వాళ్ళను కలుసుకోవడం మీకెంత ఆనందంగా ఉందో వివరించండి. తమవల్ల ఆనందం వస్తుందనుకుంటే ఎవ్వరైనా సంతోషిస్తారు. స్నేహాన్ని కొనసాగించండి: ఉన్నది ఒకటే జీవితం. ఈ చిన్నపాటి జీవితంలో అనవసర కోపాలు పెట్టుకుని అందమైన స్నేహాలను వదిలేసుకోకుండా స్నేహాన్ని కొనసాగించండి. ఒక్కసారి కలుసుకున్న స్నేహాన్ని ఎప్పటికీ కొనసాగిస్తూ ఉండండి.