
Vitamin D: పిల్లల నుంచి పెద్దల వరకూ... అందరికీ అవసరం 'డి విటమిన్'
ఈ వార్తాకథనం ఏంటి
రెండేళ్ల చిన్నారి తరచూ జబ్బులు పడుతుంది... ఇరవైఏళ్ల యువకుడికి తల జుట్టు ఊడిపోతోంది... అరగంట పని చేసినా అలసిపోయి కూర్చుంటున్న మహిళ... మందులు వాడుతున్నా బీపీ నియంత్రణలోకి రాకపోతున్న వృద్ధుడు... ఇవన్నీ విన్నాక, సమస్య ఏంటో తెలుసుకోవాలనిపిస్తుంది కదా? పరిశీలిస్తే... కారణం ఒక్కటే 'విటమిన్ డి లోపం' ఈ సమస్య కేవలం వారికే కాదు. భా రత్‌లోనే సుమారు 70-90 శాతం మంది డి విటమిన్ లోపంతో బాధపడుతున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ ఈ లోపం కారణంగా అనేక అనారోగ్యాలు ఎదురవుతున్నాయి. అందుకే... ఈ 'సన్‌షైన్ విటమిన్' గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది!
Details
విటమిన్ డి - శరీరానికి కీలకమైన పోషకం
విటమిన్ డి అనేది సూర్యరశ్మిలోని యూవీబీ కిరణాలు చర్మంపై పడినపుడు తయారవుతుంది. ఇది మొదట కాలేయానికి, తర్వాత మూత్రపిండాలకు చేరి చురుకైన హార్మోన్‌గా మారుతుంది. దీని పని: ఎముకలు, కండరాల పటుత్వానికి సహాయపడటం వ్యాధినిరోధక శక్తిని పెంపొందించటం బీపీ నియంత్రణ ఇన్సులిన్ ఉత్పత్తి గుండె ఆరోగ్య సంరక్షణ మానసిక ఆరోగ్యాన్ని సమతుల్యం చేయడం (మూడ్ స్వింగ్స్, ఆందోళన నివారణ) కాల్షియం, ఫాస్ఫరస్ గ్రహణంలో సహాయం * కొన్ని రకాల క్యాన్సర్ల నివారణ ఈ విధంగా విటమిన్ డి లోపం ఉండటం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అలసట, ఒళ్లునొప్పులు, డిప్రెషన్, జీర్ణ సంబంధిత సమస్యలు, బలహీన ఎముకలు, మతిమరుపు, బరువు పెరగడం, హార్మోన్ల అసమతుల్యత వంటి అనేక లక్షణాల రూపంలో ఇది బయటపడుతుంది.
Details
విటమిన్ డి - ఎవరికెంత అవసరం?
1 సంవత్సరం లోపు పిల్లలకు : 10 మైక్రోగ్రామ్‌లు (400 IU) 1 నుంచి 70 ఏళ్ల వయసువారికి : 15 మైక్రోగ్రామ్‌లు (600 IU) 70 ఏళ్లు పైబడిన వారికి : 20 మైక్రోగ్రామ్‌లు (800 IU)
Details
సూర్యకాంతి: విటమిన్ డి కి ప్రధాన మూలం
సూర్యుడు డి విటమిన్‌కు అత్యుత్తమ ఉచిత సోర్స్. అయితే ప్రతి ఎండ కాదు! ఈ సూచనలను గుర్తుంచుకోండి: ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 గంటల మధ్య వచ్చే ఎండే శ్రేష్టం రోజుకు 15-30 నిమిషాలు చర్మంపై ఎండ తగలేలా చూసుకోవాలి దుస్తుల వల్ల లేదా సన్‌స్క్రీన్ వల్ల సూర్యరశ్మి చర్మాన్ని తాకకపోతే డి విటమిన్ ఉత్పత్తి జరగదు కిటికీ అద్దాల ద్వారా వచ్చే ఎండ ఉపయోగం లేదు ముదురు చర్మం ఉన్నవారు మరికొంత సమయం ఎండలో గడపాలి పిల్లలు ఇంట్లో కూర్చోకుండా బయట ఆడేలా చూడాలి, పెద్దలు వాకింగ్ చేస్తూ ఎండలో గడపాలి
Details
ఆహారంలో నుంచి డి విటమిన్ ఎలా పొందాలి?
సూర్యకాంతితో పాటు, కొన్ని ఆహార పదార్థాల నుంచీ డి విటమిన్ లభిస్తుంది: చేపలు (సాల్మన్, ట్యూనా, మాకెరెల్, సార్డిన్): అధికముగా డి విటమిన్‌తో కూడినవి కాడ్‌లివర్ ఆయిల్ : 100 గ్రా.లో 250 మైక్రోగ్రామ్ వరకు డి విటమిన్ పుట్టగొడుగులు (UV ఎక్స్‌పోజర్‌తో పెరిగినవి) గుడ్డు పచ్చసొన , పాలు, పాల పదార్థాలు ఫోర్టిఫైడ్ ఆహారాలు: సోయా, బాదం పాలు, ఆరెంజ్ జ్యూస్, బ్రెడ్, నూనె, ధాన్యాలు
Details
డి విటమిన్ లోపాన్ని గుర్తించండి - నిర్లక్ష్యం వద్దు!
నిద్రలేమి, అలసట, నొప్పులు, మానసిక సమస్యలు... ఇవన్నీ చిన్న విషయాలుగా తీసుకోవద్దు. ఆరు నెలలకోసారి డి విటమిన్ పరీక్షలు చేయించుకోవాలి. అవసరమైతే వైద్యుల సలహాతో టాబ్లెట్లు, ఇంజెక్షన్లు తీసుకోవచ్చు. అయితే సహజంగా సూర్యరశ్మి, ఆహారంతో డి విటమిన్ అందిస్తే ఆరోగ్యం దృఢంగా ఉంటుంది. ఇదే నిజమైన రక్షణ. ఉచితంగా లభించే ఈ సన్‌షైన్ హెల్త్ టానిక్‌ను మిస్ కాకండి!