LOADING...
Dussehra 2025: దుష్ట రాక్షసులపై దేవీ విజయం.. దసరా పండుగ విశిష్టత ఇదే!
దుష్ట రాక్షసులపై దేవీ విజయం.. దసరా పండుగ విశిష్టత ఇదే!

Dussehra 2025: దుష్ట రాక్షసులపై దేవీ విజయం.. దసరా పండుగ విశిష్టత ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 13, 2025
04:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

దసరా అనేది ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించే పండుగ. దైవారాధన, ఉపాసన, నియమ నిష్ఠలతో జరుపుకునే ఈ పండుగ దక్షిణాయనంలో వచ్చే ప్రధాన ఉత్సవాల్లో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో దసరాను జరుపుకుంటారు. దసరా అర్థం, నవరాత్రుల ప్రాముఖ్యత దసరా అంటే పదిజన్మల పాపాలను పోగొట్టేది, పది రకాల పాపాలను తొలగించేది అని అర్థం. అందుకే దీన్ని 'నవరాత్ర వ్రతం', దేవీ నవరాత్రులు, శరన్నవరాత్రులు అని కూడా అంటారు. తొమ్మిది రోజులు జగన్మాతను పూజించి పదవ రోజున విజయాన్ని పొందడం వల్ల పదవ రోజు విజయదశమిగా పరిగణిస్తారు. నవరాత్రి అంటే కొత్త రాత్రులు అనే అర్థం. తొమ్మిది అనేది పూర్ణత్వానికి సంకేతం కాబట్టి, పరమాత్మను పరిపూర్ణంగా ఆరాధించడం నవరాత్రుల లక్ష్యం.

Details

జగన్మాత మహిమ 

జగన్మాత ఆదిపరాశక్తి. ఆమెను మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, దుర్గ, పార్వతి, హైమవతి, భవాని, లలిత, భద్రకాళి, చాముండి వంటి అనేక నామాలతో ఆరాధిస్తారు. దేవీ భాగవతం, మార్కండేయ పురాణం, త్రిపురా రహస్యం వంటి గ్రంథాలలో ఆమె మహిమను విపులంగా వివరించారు.

Details

నవరాత్రి ఆరాధన విధానం 

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు, ఈ పది రోజులు భక్తులు జగన్మాతను వివిధ రూపాల్లో ఆరాధిస్తారు. మొదటి రోజున బాలా త్రిపురసుందరి రెండవ రోజు గాయత్రి మాత మూడవ రోజు అన్నపూర్ణాదేవి నాల్గవ రోజు మహాలక్ష్మి ఐదవ రోజు లలిత త్రిపురసుందరి ఆరవ రోజు రాజరాజేశ్వరి ఏడవ రోజు మహాసరస్వతి ఎనిమిదవ రోజు దుర్గాదేవి తొమ్మిదవ రోజు మహిషాసురమర్దిని పదవ రోజు అపరాజితా దేవిగా పూజిస్తారు. ఈ సమయంలో భక్తులు శారీరక, మానసిక, ఆధ్యాత్మిక నియమాలను పాటిస్తూ మంత్రజపం, పారాయణం, భజనలు, ఉపవాసం చేస్తారు. చివరి రోజున ప్రత్యేక పూజలు చేసి పిండివంటలతో నైవేద్యం సమర్పించి, ప్రసాదాన్ని బంధుమిత్రులతో పంచుకుంటారు

Advertisement

Details

 దసరా పురాణగాథలు 

జగన్మాత రాక్షసుల సంహారిణి. మధు-కైటభులు, మహిషాసురుడు, రక్తబీజుడు, ధూమ్రాక్షుడు, చండ-ముండులు, శుంభ-నిశుంభులను ఆమె సంహరించారు. రాక్షసులు వరప్రభావంతో దేవతలకు భయపెట్టినా, స్త్రీలను చులకన చేసినందున, అమ్మవారు వివిధ శక్తుల రూపాల్లో అవతరించి వారిని సంహరించారు. మధు, కైటభులు → అహంకారం, మమకారం ప్రతీకలు. రక్తబీజుడు → మోహానికి ప్రతీక. కాళిదేవి అతని రక్తాన్ని మింగి కొత్త రక్తబీజులు పుడకుండా చేసింది. ధూమ్రాక్షుడు → అజ్ఞానం సూచకుడు. మహిషాసురుడు → జంతు తత్వం, రాజస, తామస గుణాలకు ప్రతీక. ఇవి అన్నీ మనలోని లోపాలను సూచిస్తున్నాయి. వాటిని జయించడం ద్వారానే దైవత్వం సాధ్యం.

Advertisement

Details

విజయదశమి ప్రత్యేకత 

దసరా పండుగలో చివరి రోజు విజయదశమి. ఇది దుష్టత్వంపై దైవత్వం సాధించిన విజయానికి ప్రతీక. ఈ రోజున అర్జునుడు శమీవృక్షం నుంచి ఆయుధాలను తీసుకుని కౌరవులను ఓడించాడు. శమీ వృక్షాన్ని పూజించడం, శమీ పత్రాలను పెద్దలకు ఇవ్వడం ఆనవాయితీ. శ్రీరాముడు రావణుడిని సంహరించిన రోజు ఇదే. అందుకే రామలీల ప్రదర్శనలు, రావణ దహనం జరుగుతాయి. విజయదశమి కేవలం పండుగ మాత్రమే కాదు. ఇది మనలోని ఆసురీ గుణాలను తొలగించి, దైవీ గుణాలను పెంపొందించుకోవాలని గుర్తు చేస్తుంది. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సర్యం వంటి అరిషడ్వర్గాలను జయించడం ద్వారానే జగన్మాత కృప లభిస్తుంది. మనం భౌతిక రాక్షసులతో కాదు, అంతర్గత దుర్గుణాలతో యుద్ధం చేసి, శుద్ధ సత్వగుణాన్ని పొందాలి.

Advertisement