Happiest Passports 2026: ప్రపంచంలోనే అత్యంత ఆనందాన్ని ఇచ్చే పాస్‌పోర్ట్ ఇదే...టాప్ 10లో ఏయే దేశాలున్నాయంటే
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలో అత్యంత ఆనందాన్నిచ్చే పాస్‌పోర్ట్ ఏ దేశానిది? ప్రయాణించేందుకు ఎక్కువ దేశాలకు అనుమతి ఉండటమే మంచి పాస్‌పోర్ట్‌కు కొలమానమా? లేక ఆ దేశంలో నివసించే ప్రజల జీవన ప్రమాణాలు కూడా ముఖ్యమేనా? ఈ ప్రశ్నలకు సమాధానంగా 2026 హ్యాపీ పాస్‌పోర్ట్స్ ఇండెక్స్ (Happy Passports Index 2026) జాబితా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. గ్లోబల్ సిటిజన్ సొల్యూషన్స్ విడుదల చేసిన ఈ నివేదికలో ఫిన్‌లాండ్ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. అంతేకాదు.. తొలి నాలుగు స్థానాలనూ నార్డిక్ దేశాలే కైవసం చేసుకోవడం విశేషం.
Details
ఐదు అంశాల ఆధారంగా 50 దేశాలకు ర్యాంకులు
ఈ ర్యాంకింగ్స్ కోసం ఆరు ప్రాంతాలకు చెందిన 50 దేశాలను ఐదు ప్రధాన అంశాల ఆధారంగా పరిశీలించారు.
ప్రజల సంతోషం, వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రయాణ సౌకర్యాలు, ఆర్థిక స్థితిగతులు, ఆరోగ్యం, భద్రత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు.
ప్రజలకు తమ జీవితంపై నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉందా? ఆదాయం, సగటు ఆయుర్దాయం ఎలా ఉన్నాయి? దేశంలో శాంతిభద్రతల పరిస్థితి ఏంటి? ఆ పాస్‌పోర్ట్‌తో ఎన్ని దేశాలకు వెళ్లవచ్చు? ఇలాంటి అంశాలను విశ్లేషించి ప్రతి దేశానికి 100 మార్కులకు స్కోర్ కేటాయించారు.
Details
టాప్ 10లో నిలిచిన దేశాలు ఇవే
ఈ జాబితాలో ఫిన్‌లాండ్ 93.2 స్కోర్‌తో అగ్రస్థానంలో నిలవగా, ఐస్‌లాండ్ 92.4, డెన్మార్క్ 92.1 స్కోర్లతో రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నాయి.
నార్వే 89.3తో నాలుగో స్థానంలో ఉంది. స్విట్జర్లాండ్ (88.3), స్వీడన్ (88.2), నెదర్లాండ్స్ (86.2), న్యూజిలాండ్ (84.4), ఆస్ట్రియా (83.8), సింగపూర్ (82.8) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
ఈ టాప్ 10లో యూరప్ వెలుపల ఉన్న దేశాలు న్యూజిలాండ్, సింగపూర్ మాత్రమే కావడం మరో ఆసక్తికరమైన అంశం.
Details
పాస్‌పోర్ట్ బలం కంటే జీవన స్వేచ్ఛే ముఖ్యమట!
పరిశోధకుల విశ్లేషణ ప్రకారం.. సంపన్న దేశాల్లో ప్రజల ఆనందానికి పాస్‌పోర్ట్ బలం లేదా ఆదాయం కంటే తమ జీవితాన్ని తామే నిర్ణయించుకునే స్వేచ్ఛ ఎక్కువగా సంబంధం కలిగి ఉంది.
దీనికి సింగపూర్ మంచి ఉదాహరణ. ఈ ఇండెక్స్‌లో పరిశీలించిన దేశాల్లో అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్ కలిగి, ప్రయాణ స్వేచ్ఛలో మొదటి స్థానంలో ఉన్నప్పటికీ మొత్తం ర్యాంకింగ్స్‌లో పదో స్థానానికే పరిమితమైంది.
మరోవైపు తక్కువ శక్తిమంతమైన పాస్‌పోర్ట్ ఉన్న కోస్టారికా దేశీయ స్వేచ్ఛ, జీవన సంతృప్తి అంశాల్లో మెరుగైన స్కోర్లు సాధించి 13వ స్థానంలో నిలిచింది.
అంటే మంచి పాస్‌పోర్ట్ ప్రయాణాలకు అవకాశాలు కల్పించవచ్చు. కానీ నిజమైన ఆనందం మాత్రం అక్కడి ప్రజల జీవన పరిస్థితులు, స్వేచ్ఛపైనే ఆధారపడి ఉంటుందని ఈ నివేదిక చెబుతోంది.