Page Loader
Happy Friendship Day 2023: విలసిల్లుతున్న ఆన్‌లైన్ స్నేహం
విలసిల్లుతున్న ఆన్‌లైన్ స్నేహం

Happy Friendship Day 2023: విలసిల్లుతున్న ఆన్‌లైన్ స్నేహం

వ్రాసిన వారు Stalin
Aug 06, 2023
10:39 am

ఈ వార్తాకథనం ఏంటి

వేడుక, ఆనందం, బాధ ఎలాంటి అనుభూతిని అయినా పంచుకోవడానికి ప్రతి ఒక్కరికి ఓ ఫ్రెండ్ అనేవాడు ఉంటాడు. ఫ్రెండ్‌షిప్ అనేది మన జీవితాలను సుసంపన్నం చేసే అమూల్యమైన బంధం. ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా దాని విశిష్టత, నేటి సాంకేతిక యుగంలో చిగురిస్తున్న ఆన్‌లైన్ స్నేహాల గురించి తెలుసుకుందాం. ప్రతి‌ఏటా భారతదేశంలో, ఫ్రెండ్‌షిప్ డే ఆగస్ట్‌లో మొదటి ఆదివారం వస్తుంది. అమెరికా, బంగ్లాదేశ్, యూఏఈ, మలేషియా వంటి దేశాలు కూడా ఫ్రెండ్‌షిప్ డేను ఈరోజునే జరుపుకుంటారు. 1958లో పరాగ్వేలో హాల్‌మార్క్ కార్డ్‌ల యజమాని జోస్‌హాల్ ఫ్రెండ్‌షిప్ డేని జరుపుకునే ఆలోచనను ప్రతిపాదించారు. 2011లో ఐక్యరాజ్యసమితి జులై 30ని అంతర్జాతీయ స్నేహ దినోత్సవంగా ప్రకటించింది. కొన్ని దేశాలు వివిధ తేదీల్లో ఈ వేడుకను జరుపుకుంటున్నాయి.

స్నేహం

ఆన్‌లైన్ ప్లాట్ ఫారమ్‌లలో పాత స్నేహితులు, కొత్త బంధాలు

ఆన్‌లైన్‌లో స్నేహితులను కలుసుకోవడం అనేది కొంచెం వయసు మళ్లిన వారికి కొత్తగా అనిపించొచ్చు. కానీ ఇదేం కొత్త పద్దతి కాదు. దశాబ్దాల క్రితం తమ స్నేహితుల యోగ క్షేమాలను తెలుసుకోవడం కోసం లేఖలు రాసేవారు. ఇప్పుడు ఈ లేఖలు రాసే పద్దతికి సాంకేతిక వెర్షన్‌ జోడించడం ద్వారా ఆన్‌లైన్ స్నేహం పుట్టుకొచ్చింది. దీంతో అప్పుడు లేఖల ద్వారా సంభాషించుకునే స్నేహితులు.. ఇప్పుడు ఆన్‌లైన్‌ ద్వారా మాట్లాడుకుంటున్నారు. అంటే మాధ్యమం మాత్రమే మారింది. అలాగే ఆన్‌లైన్ స్నేహం వల్ల పాత మిత్రులను కలుసుకోవడంతోపాటు, కొత్త స్నేహితులను కూడా కలుస్తారు. దీంతో మీ స్నేహితులు జాబితా పెరిగిపోతుంది.

స్నేహం

టీనేజ్‌లో ఉన్నవారికి సగానికి పైగా ఆన్‌లైన్ స్నేహితులే

టీనేజ్ యువతకు సగానికి పైగా స్నేహితులు ఆన్‌లైన్ ద్వారానే కలుస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. సోషల్ మీడియాలో అభిరుచులు కలవడం ద్వారా కావొచ్చు, ప్రొఫెషన్ వల్ల కావొచ్చు, గేమింగ్ ప్లాట్ ఫారమ్‌ల రూపంలో కొత్త స్నేహితులను కలవడానికి అనేక ఆన్ లైన్ వేదికలు ఉన్నాయి. 2015లో 57శాతం మంది యువకులు ఆన్‌లైన్‌లో కొత్త స్నేహితుడిని కలుసుకున్నట్లు ఓ పరిశోధన నివేదిక చెప్పింది. 29శాతం మంది యువకులు ఆన్‌లైన్ వేదికలలో ఐదుగురు కంటే ఎక్కువ కొత్త స్నేహితులను సంపాదించుకున్నారట. అయితే ఇందులో కేవలం 20శాతం మంది యువకులు మాత్రమే తమ ఆన్‌లైన్ స్నేహితులను వ్యక్తిగతంగా కలుసుకున్నారు.