ఈ జాగ్రత్తలు పాటిస్తే కండ్లకలక నుండి మీకు త్వరగా విముక్తి కలుగుతుంది
ఈ మధ్య వచ్చిన భారీ వర్షాల కారణంగా కండ్లకలక కేసులు భారీగా నమోదవుతున్నాయి. కళ్లు ఎర్రబడడం నీరు కారడం, కళ్లు మంట పుట్టడం,కళ్లు వాపుతో పాటు దురదపెట్టడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కండ్లకలక రోజువారీ పనులకు ఆటంకాలను కలిగించడమే కాకుండా రోజువారీ పనులపై దృష్టి పెట్టనీకుండా కష్టతరం చేస్తుంది. కండ్లకలకను ఎదుర్కోవటానికి ఇప్పుడు చెప్పబోయే కొన్ని జాగ్రత్తలను పాటిస్తే దాని నుండి మీకు త్వరగా విముక్తి కలుగుతుంది. కండ్లకలక నివారించడానికి ముందుగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. బయటఏది పడితే అది ముట్టుకోకుండా ఉండాలి.అంతేకాకుండా సబ్బుతో తరచుగా చేతులు కడుకోవాలి. పరిశుభ్రంగా లేని చేతులతో కళ్లను తాకడం మానుకోవాలి. దీనివల్ల కళ్లలోకి జెర్మ్స్ ,బ్యాక్టీరియా బదిలీకి దారి తీస్తుంది, ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది
కండ్ల కలక వచ్చినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు
చేతులను తరచుగా కడుకోవాలి. అలాగే కళ్ళు,ముక్కు లేదా నోటిని తాకిన తర్వాత కనీసం 20 సెకన్ల పాటు సబ్బు, నీటితో మీ చేతులను కడగాలి. ప్రతి నిమిషానికి కళ్ళను తాకడం మానుకోండి. దీనివల్ల ఇతర వ్యక్తులకు ఇన్ఫెక్షన్ వ్యాపించే అవకాశం ఉంది. మీరు మీ కళ్ళను తాకవలసి వస్తే, ముందుగా మీ చేతులనుకడుకోండి. కళ్లు పొడిబారకుండా వైద్యుడి సలహాను అనుసరించి కంటి చుక్కల మందు వాడండి. దీనివల్ల మీ కళ్లకు ఉపశమనంకలగడమే కాకుండా , లూబ్రికేట్ చేయడానికి సహాయపడతాయి. కంటి చుక్కల మందును చాలా మందుల దుకాణాలలో ఓవర్-ది-కౌంటర్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు. మీ కళ్లు ఉబ్బుగా,నొప్పిగా, లోపల ఇరిటేషన్ కలిగిస్తుంటే ఒక కర్చీప్‌లో ఐస్ ముక్కలు వేసి మీ కళ్లపై ఉంచండి.
కండ్లకలక క్లియర్ అయ్యే వరకు లెన్స్ వాడకండి
కండ్లకలక నయం కావడానికి సమయం సమయం పడుతుంది. దానికి చాలా విశ్రాంతి తీసుకోవాలి. వీలైనంత సేపు నిద్ర పోవాలి. ఒక వేళ మీరు కాంటాక్ట్ లెన్సులు వాడుతున్నట్లు ఐతే కండ్లకలక సమయంలో వాటిని ధరించడం మానుకోండి. ఇది సంక్రమణ వ్యాప్తిని నివారించడానికి సహాయపడుతుంది. కండ్లకలక వచ్చిన కొన్ని రోజుల తర్వాత కూడా తగ్గకుండా అలాగే ఉంటే వైద్యుడిని సంప్రదించండి. కొన్ని సందర్భాల్లో, లక్షణాలు తీవ్రంగా ఉన్నా లేదా జ్వరం వచ్చినా వైద్యుడిని సంప్రదించండి. మీ టవల్ లేదా కర్చీఫ్ ను ఇతరులతోపంచుకోకండి. మీరు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మీ నోరు, ముక్కును కప్పుకోండి. మీ పిల్లలు కండ్లకలకతో బాధపడుతున్నట్టయితే అది నయమయ్యేవరకు ఇంటి వద్దే ఉంచండి.