Organic Holi Colours : హోలీకి ఇంట్లోనే పూలతో సహజ రంగుల తయారీ..
ఈ వార్తాకథనం ఏంటి
హోలీ పండుగ సమీపిస్తోంది! ఈ రంగుల వేడుకలో రసాయన రంగుల వాడకాన్ని నివారించాలన్న ప్రచారం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంది.
ఎందుకంటే, ఈ కృత్రిమ రంగులు ఆరోగ్యానికి హానికరం కావచ్చు. అయితే, మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఆర్గానిక్ రంగుల ధరలు అధికంగా ఉంటాయి.
అంతేకాదు, అవి నిజంగా సహజసిద్ధమైనవేనా అనే సందేహం కూడా ఉండొచ్చు.
కాబట్టి, కొంత శ్రమించి ఇంట్లోనే సహజ రంగులను తయారు చేసుకోవడం ఉత్తమం. అవి ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వివరాలు
హోలీకి ఆయుర్వేద ప్రాధాన్యం
హోలీ వెనుక అనేక పురాణ కథలు ఉన్నప్పటికీ, ఆయుర్వేదంలో దీనికి ప్రత్యేక ప్రస్తావన ఉంది.
చలికాలం ముగిసి వేసవి ప్రారంభమయ్యే సమయాల్లో గాలిమార్పు వల్ల జలుబు, జ్వరాలు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి.
ఈ వ్యాధులను నివారించేందుకు ఔషధ గుణాలు కలిగిన పూలు, ఆకుల పొడులను ఉపయోగించి రంగులను తయారు చేసుకునే సంప్రదాయం ఉంది.
ముఖ్యంగా, మోదుగ, మందార పూలను నీటిలో మరిగిస్తే, ఆ నీటిలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి.
ఈ నీటిని శరీరానికి రాసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. హోలీ రోజున చల్లని పానీయాలు తాగడం, మిఠాయిలు తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని అంటారు.
వివరాలు
ఇంట్లో సహజ రంగుల తయారీ విధానం
పసుపు (Yellow) ఈ రంగును తయారు చేయాలంటే కొంత శ్రమ అవసరం. 50గ్రాముల బంతి పువ్వులు 20 గ్రాముల నారింజ తొక్కల పొడి 200గ్రాముల చేమగడ్డ పొడి 100గ్రాముల పసుపు 20 చుక్కల నిమ్మరసం ఈ పదార్థాలన్నీ ఒక పెద్ద పాత్రలో బాగా కలిపితే సహజ పసుపు రంగు సిద్ధమవుతుంది.
ఎరుపు (Red) మందార పువ్వులను శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టాలి.పూర్తిగా ఎండిన తర్వాత మెత్తని పొడిగా నూరుకోవాలి.ఎక్కువ పరిమాణంలో కావాలనుకుంటే కొంత బియ్యప్పిండి కలపవచ్చు. ఎర్ర చందనం పౌడర్ ద్వారా కూడా సహజ ఎరుపురంగును తయారు చేసుకోవచ్చు.తడి రంగు కావాలంటే,లీటర్ నీటిలో రెండు చెంచాల ఎర్ర చందనం పొడిని వేసి మరగనివ్వాలి.చల్లారిన తర్వాత కొద్దిగా నీరు కలిపితే తడి రంగు సిద్ధమవుతుంది.
వివరాలు
ఇంట్లో సహజ రంగుల తయారీ విధానం
గోధుమ (Brown) గోరింటాకు పొడి + నాలుగు భాగాల ఉసిరి పొడి కలిపితే తడి గోధుమ రంగు సిద్ధమవుతుంది. పొడి రంగుగా తయారు చేయాలంటే, ఈ మిశ్రమంలో కొంత బియ్యప్పిండి కలిపితే సరిపోతుంది.
నీలం (Blue) నీలం రంగును తయారు చేసేందుకు "జకరండ" (నీలి గుల్మహార్) పూలను ఎండబెట్టి పొడిచేయాలి. కేరళ ప్రాంతంలో నీలిమందు చెట్ల ఆకులు, కాయలు ఉపయోగించి సహజ నీలం రంగును తయారుచేస్తారు. తడి రంగు కావాలంటే, నీలిమందు చెట్ల కాయలను పొడి చేసి నీటిలో కలిపితే బ్లూ కలర్ సిద్ధమవుతుంది.
వివరాలు
ఇంట్లో సహజ రంగుల తయారీ విధానం
ఆకుపచ్చ (Green) గోరింటాకు పొడిని బియ్యప్పిండితో సమాన పరిమాణంలో కలిపితే ఆకుపచ్చ రంగు సిద్ధమవుతుంది. వేప ఆకులను నీటిలో మరిగించి చిక్కటి మిశ్రమంగా తయారుచేసి వడబోసిన నీటిని తడి ఆకుపచ్చ రంగుగా ఉపయోగించవచ్చు.
కాషాయం (Orange) మోదుగ పూలను రాత్రి నీటిలో నానబెట్టి లేదా మరగబెట్టి రంగు తయారుచేయవచ్చు. ఎండబెట్టిన మోదుగ పువ్వులను పొడిచేసి పొడి రంగుగా కూడా ఉపయోగించవచ్చు. కుంకుమ పువ్వును నీటిలో నానబెడితే సహజ కాషాయం రంగు సిద్ధమవుతుంది.
వివరాలు
ఇంట్లో సహజ రంగుల తయారీ విధానం
గులాబీ (Pink) పసుపు రంగు మందార పువ్వులు లేదా బీట్‌రూట్ ద్వారా సహజ గులాబీ రంగును తయారుచేయవచ్చు. బీట్‌రూట్‌ను పేస్ట్‌గా నూరి, ఆ మిశ్రమాన్ని ఎండబెట్టి పొడిచేసి ఉపయోగించవచ్చు. తడి రంగు కావాలంటే, బీట్‌రూట్ ముక్కలను నీటిలో మరగబెట్టి ఆ నీటిని ఉపయోగించాలి.
ఇలా సహజపద్ధతుల్లో ఇంట్లోనే హోలీ రంగులను తయారుచేసుకోవచ్చు. ఇవి ఆరోగ్యానికి హానికరం కాకుండా, చర్మానికి మేలు చేసే గుణాలను కలిగి ఉంటాయి. ఈ హోలీ పండుగను భద్రతతో, ఆనందంగా జరుపుకోవాలంటే సహజ రంగులకే ప్రాధాన్యం ఇవ్వండి!