Page Loader
Motivational Story: ఎదుటివారిలో తప్పులు వెతకడం మొదలు పెడితే.. ఒంటరిగా మిగిలిపోతారు!

Motivational Story: ఎదుటివారిలో తప్పులు వెతకడం మొదలు పెడితే.. ఒంటరిగా మిగిలిపోతారు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 07, 2025
02:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

బయటకే కాదు, మనుషుల ఆత్మస్వరూపానికీ ఒక గురివింద గింజతో పోలిక ఉంటుంది. బయటకు ఎర్రగా, ఆకర్షణీయంగా కనిపించే గురివింద గింజను కొంచెం లోపల చూడగానే నలుపు మచ్చలాంటిది కనపడుతుంది. కొందరి వ్యక్తిత్వం కూడా ఇలాగే ఉంటుంది. సొంత లోపాలు కనిపించకుండా ఉంటూ, ఎదుటివారి తప్పులకే కళ్లద్దాలు పెట్టేసినట్టుగా చూసే అలవాటు. ఎదుటివారి తప్పుల్ని ఎత్తి చూపడమే జీవిత ధ్యేయంగా చేసుకుంటే మీ చుట్టూ ఉన్నవాళ్లు ఒకరొకరుగా తొలగిపోతారు. బంధువులు, స్నేహితులు.. చివరికి మీవారు కూడా దూరమైపోతారు. ఆఖరికి మీరు ఒంటరిగా మిగిలిపోతారు.

Details

ఓసారి మనల్ని ప్రశ్నించుకోవాలి

ఎవరికైనా తప్పులు ఉండొచ్చు. కానీ, ఎదుటివారిని తప్పులకే పరిమితం చేసి చూస్తే... మీ జీవితం అల్లకల్లోలమవుతుంది. సంతోషం, సాన్నిహిత్యం అనే భావనలు ఒక్కొక్కటిగా మాయమవుతాయి. ఓ సారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు ఒక వేలుతో ఎవరినైనా నిందిస్తున్నప్పుడు మిగిలిన నాలుగు వేళ్లు మీ వైపే చూపిస్తున్నాయని మీకు తెలుసా? ఎప్పటికీ ఇతరులను విమర్శించే వ్యక్తుల జీవితాల్లో అనుబంధాలు నిలబడవు. వాళ్లు ప్రేమను అర్థం చేసుకోలేరు. నిందలు వేయడంలోనే సంతృప్తి పొందేవాళ్లు, ఇతరుల మనోస్థితిని దెబ్బతీయడానికే పన్నాగాలు పన్నే వర్గంగా మారిపోతారు. అటువంటి వారిని "విషపూరితమైన వ్యక్తులు"గా పరిగణిస్తారు.

Details

ప్రేమను పంచితే ప్రేమ లభిస్తుంది

ప్రతీ మనిషిలోనూ లోపాలుంటాయి. కానీ మీరు చేయాల్సింది వారిని మార్చే ప్రయత్నం కాదు. ముందుగా మీ లోపాలను గుర్తించి, మీరు మారాలి. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రేమించండి. పక్కవారితో ఆనందంగా మెలగడం నేర్చుకోండి. అప్పుడు నిజమైన జీవితం ఎలా ఉండాలో మీకు అర్థమవుతుంది. ఇక ఒకటి గుర్తుంచుకోండి మీరు ఇతరులకు ఏది ఇస్తారో అదే మీకు తిరిగివస్తుంది. అవమానం చేస్తే, అవమానమే వస్తుంది. ప్రేమను పంచితే, ప్రేమే లభిస్తుంది. మీ మనసు, మాటలు, ప్రవర్తన విషపూరితంగా మారితే - జీవితం ఒంటరితనంగా మారుతుంది. విశ్వాసాన్ని నాశనం చేస్తూ, పరిసరాలను నెగెటివ్‌గా మార్చే వారు అసలే ప్రశాంతంగా జీవించలేరు. అలాంటి వ్యక్తుల నుంచి అందరూ దూరంగా వెళ్లిపోతారు.