LOADING...
Gurugram:నవజాత శిశువు కడుపులో కవలలు.. వైద్య రంగంలో అరుదైన ఘటన
వైద్య రంగంలో అరుదైన ఘటన

Gurugram:నవజాత శిశువు కడుపులో కవలలు.. వైద్య రంగంలో అరుదైన ఘటన

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 05, 2025
02:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

గురుగ్రామ్‌లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. కేవలం ఒక నెల వయసున్న చిన్నారి కడుపులో ఒక్కటి కంటే ఎక్కువ పిండాలు పెరుగుతున్నట్టు వైద్యులు గుర్తించారు. శస్త్రచికిత్స ద్వారా వాటిని విజయవంతంగా తొలగించారు. ఈ పరిస్థితిని "ఫీటస్ ఇన్ ఫీటు" (Foetus in fetu) అంటారు. ఇది అత్యంత అరుదైన వ్యాధి. ఇలాంటివి ప్రపంచవ్యాప్తంగా ఐదు లక్షల మందిలో ఒకరిలో కనిపిస్తాయని వైద్యులు పేర్కొన్నారు. అంతేకాదు, ఈ కేసులో చిన్నారి కడుపులో ఇద్దరు పరాన్న జీవుల్లాంటి భ్రూణాలు ఉండటం మరింత అసాధారణం. ఇలాంటి కేసులు ప్రపంచవ్యాప్తంగా 30 సార్లకు మించి రికార్డ్ కాలేదు. బిడ్డ కడుపు ఉబ్బడం, నిరంతరం అసహనం,తినే సమస్యలు మొదలైన లక్షణాలు కనిపించడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు.

వివరాలు 

"ఫీటస్ ఇన్ ఫీటు" అంటే ఏమిటి?

ఆసుపత్రిలో స్కాన్‌ చేయగా కడుపులో ఒక సంచిలో రెండు అభివృద్ధి చెందని భ్రూణాలు ఉన్నట్టు బయటపడింది. గర్భధారణలో తొలివారాల్లోనే ఒక భ్రూణం సరిగా అభివృద్ధి కాక,మరొక భ్రూణం దానిని లోపలకి లాక్కునే పరిస్థితి వస్తుంది. అదే ఫీటస్ ఇన్ ఫీటు.సులభంగా చెప్పాలంటే.. ఒక జంటలో ఒకటి బతికి మరొకటి దాని శరీరంలో ఇరుక్కుపోతుంది. జీవం లేని ఆ భ్రూణం,బతికి ఉన్న బిడ్డ శరీరంలో నుంచి పోషకాలు తీసుకుంటూ క్రమంగా పెరుగుతుంది. ఇది ఎప్పటికీ సజీవ శిశువుగా మారదు. అయితే కొన్నిసార్లు ఎముకల ముక్కలు, అవయవాల రూపాలు కనిపించవచ్చు.

వివరాలు 

శస్త్రచికిత్స ఎలా చేశారు?

ఈ కేసులో తల్లి మూడవైపుల నుండి గర్భం దాల్చగా,అందులోని ఇద్దరు పూర్తిగా ఎదగని భ్రూణాలు బిడ్డ కడుపులో చిక్కుకున్నాయి. డాక్టర్లు చెబుతున్నట్టు, ఇవి క్యాన్సర్‌లాగా పెరగవు. ఒకసారి శస్త్రచికిత్సతో తీసేస్తే తిరిగి వచ్చే అవకాశం దాదాపు ఉండదు. "కేవలం నెల రోజుల చిన్నారిపై శస్త్రచికిత్స చేయడం వైద్యులకు పెద్ద సవాలు.ముందుగా బిడ్డ ఆరోగ్యం బావుండడం కోసం.. డీహైడ్రేషన్‌, పోషకాహార లోపం కారణంగా రెండు రోజుల పాటు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అనంతరం సుమారు 15 మంది నిపుణుల బృందం.. చిన్నారుల శస్త్రచికిత్స వైద్యులు,అనస్థీషియా నిపుణులు కలిసి ఆపరేషన్ చేపట్టారు. ఈ రెండు భ్రూణాలు కాలేయం, మూత్రపిండాలు,పేగులు వంటి కీలక అవయవాలకు అంటుకుని ఉండటంతో జాగ్రత్తగా వేరుచేశారు.

వివరాలు 

ప్రతి క్షణం అప్రమత్తత అవసరం

రక్తస్రావం ఎక్కువ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. 'శస్త్రచికిత్స సమయంలో బిడ్డ శరీర ఉష్ణోగ్రతను నిరంతరం పరిశీలించాల్సి వచ్చింది.ఇలాంటి సమయంలో ప్రతి క్షణం అప్రమత్తత అవసరం,'అని ఆపరేషన్‌కు నేతృత్వం వహించిన డాక్టర్ ఆనంద్ సిన్హా తెలిపారు. శస్త్రచికిత్స తర్వాత ఒక నెల ఆసుపత్రిలో చికిత్స పొందిన చిన్నారి ప్రస్తుతం ఆరోగ్యంగా కోలుకుంటోందని ఆయన చెప్పారు.

వివరాలు 

భారత్‌లో ఇంతకు ముందు కూడా

ఇలాంటి కేసులు భారత్‌లో ఇంతకు ముందు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో మహారాష్ట్రలో మూడు రోజుల చిన్నారికి ఇలాంటి శస్త్రచికిత్సే విజయవంతమైంది. అలాగే 2024లో కోల్కత్తాలో ఒక బిడ్డ కడుపులోని ఇద్దరు భ్రూణాలను తొలగించారు. అయితే ఆ శిశువు శస్త్రచికిత్స తర్వాత ఒక రోజుకే మరణించాడు. నిపుణులు చెబుతున్నదేమిటంటే - గర్భధారణ సమయంలో చేసే అల్ట్రాసౌండ్ స్కాన్‌లలోనే ఇలాంటి సమస్యలు గుర్తించవచ్చు. అలాంటి పరీక్షలు తప్పనిసరిగా చేయాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.