Jaipur Special: బాలీవుడ్‌ను సైతం ఆకర్షిస్తున్నలొకేషన్.. అయితే, వింటర్ లో ఇక్కడకు టూర్ వేసేయండి..!
జైపూర్ నగరం భారతదేశంలోని అత్యంత సాంస్కృతిక వారసత్వం కలిగిన నగరాలలో ఒకటి. ఈ నగరాన్ని చుట్టూ అనేక అందమైన ప్రాంతాలు,సాంస్కృతిక వారసత్వ కేంద్రములు ఉన్నాయి. ఇలాంటి ఒక అద్భుతమైన ప్రదేశం సమోద్ గ్రామం. ఈ గ్రామం దేశీయ, విదేశీ పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తుంది. యధార్థంగా, సమోద్ గ్రామానికి సాంస్కృతికంగా ఉన్న అస్తిత్వం 16వ శతాబ్దంలో రావల్ మహారాజ్ కోటను నిర్మించిన తరువాత మొదలైంది. ఈ కోట ఈ ప్రాంతానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇక దీంతో ఇక్కడ అనేక సినిమాలు, షూటింగ్‌లు జరుగుతుంటాయి.
హనుమాన్ ఆలయం - భక్తులకు పవిత్ర స్థలం
జైపూర్ నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమోద్ గ్రామంలో సమోద్ పర్వతం పై హనుమాన్ ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది, ముఖ్యంగా 700 సంవత్సరాల కిందటి హనుమంతుడు విగ్రహం ఇక్కడ ఉంది. భక్తులు దుర్గమమైన 1100 మెట్లు ఎక్కి ఆలయానికి చేరుకుంటారు. ఇక్కడ హనుమంతుని దర్శనమిచ్చిన భక్తుల కోరికలు నెరవేరుతాయని నమ్మకం.
సమోద్ ప్యాలెస్ - రాజభోగ అనుభవం
ఇకపోతే, ఇక్కడి సమోద్ ప్యాలెస్ హెరిటేజ్ హోటల్‌గా మారింది. ఇక్కడ బస చేయడం ఒక రాచరిక అనుభవం. విదేశీ పర్యాటకులు ఎక్కువగా ఇక్కడ సందర్శిస్తారు. ఇందులోని శీష్ మహల్ ప్రత్యేకంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ ప్యాలెస్ లోని సంప్రదాయ వాల్ పెయింటింగ్స్, గేట్లు ఇవన్నీ పర్యాటకులకు ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తాయి. వెడ్డింగ్ షూట్‌లకు ప్రసిద్ధి సమోద్ గ్రామం విదేశీ పర్యాటకులు మాత్రమే కాకుండా రాయల్ వెడ్డింగ్‌లు, ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్‌లకు కూడా ప్రసిద్ధి. ఎప్పుడూ ఏదో ఒక షూటింగ్ ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా, బన్సా బాగ్ ఆఫ్ సమోద్ హెరిటేజ్ ప్యాలెస్ ప్రీ వెడ్డింగ్ షూట్‌లకు ప్రసిద్ధి చెందింది.