Morning : ఉదయం లేచాక కళ్లు మసకగా ఉన్నాయా.. ఎందుకో తెలుసా
మానవ శరీరంలో ఉదయాన్నేకొందరిలో నేత్రాలు మసక బారినట్లు కనిపిస్తాయి. అయితే సాధారణంగా దృష్టి చక్కగా ఉన్న వారికి, పొద్దున పూట నిద్ర లేచాక కళ్లు మసకగా కనిపిస్తాయి. ఇటువంటి లక్షణాలు ఎవరిలో కనిపించిన వాటికి కారణాలు మాత్రం ఇవేనని అంటున్నారు నేత్రవైద్య నిపుణులు. 1. ఉదయాన్నే మసకగా ఉండేందుకు కారణాలు : కళ్లు పొడిబారడం ఒకటి. మన కళ్లను కన్నీళ్లు ఎల్లప్పుడూ కాపాడుతుంటాయి. నిద్రించే సమయంలో ఒక్కోసారి కంట్లోకి కన్నీళ్లు ఊరవు. ఫలితంగా అవి పొడి బారిపోతాయి. దీంతో నిద్ర లేచాక కాసేపటి వరకు చూపు మందగించినట్లుగా అనిపిస్తుంటుంది. నిద్ర లేచిన కాసేపటికి కను రెప్పలు మూసి తెరుస్తూ ఉంటే మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటుందని నేత్ర నిపుణులు అంటున్నారు.
అలర్జీలు కలిగిన సమయంలోనూ ఇబ్బందే
2. కళ్లల్లో అలెర్జీలు : నేత్రాలకు అలర్జీలు కలిగిన సమయంలో అవి దురద పెట్టడం సహజం. వాసిపోవడం, పొడి బారడం వంటివి జరుగుతుంటాయి. ఇంకేమైనా ఉంటే ఉదయం పూట కాసేపు కళ్లు సరిగ్గా కనిపించలేనట్లు ఉంటాయి. 3. రక్తంలో చక్కెర : శరీరంలో రక్తంలో చక్కెర అధికంగా ఉండటం, మరీ తక్కువగా ఉండటం జరిగితే ఉదయాన్నే చూపు మందగించినట్లుగా అనిపిస్తుంది. బలహీనతకు తోడు ఇలాంటి లక్షణాలు ఉంటే మధుమేహం పరీక్షలు చేయించుకోవాలి. 4. ఒత్తిడితో నిద్ర : కొంతమంది బోర్లా పడుకుని ముఖాన్ని తలగడలాగా పెట్టుకుంటారు. అలాంటప్పుడు కళ్లు ఒత్తినట్లై వాటికి ఒత్తిడి కలుగుతుంది. ఈ సమయంలోనూ ఇటువంటి అసౌకర్యం కలుగుతుందని వైద్య నిపుణలు పేర్కొన్నారు.
మాత్రలు కూడా కొంత ప్రభావం చూపించొచ్చు : నేత్ర వైద్య నిపుణులు
నిద్రించే ముందు ఔషధాలు : రాత్రి నిద్రపోయే ముందు పలు రకాల ఆరోగ్య సమస్యలకు మాత్రలు వేసుకుంటుంటారు. నిద్ర మాత్రలు, జలుబు మాత్రలు, బీపీ గోలీలు వంటివి కళ్లలో నీరు ఊరడంపై ప్రభావం చూపిస్తాయి. ఈ కారణంగానే ఉదయాన్నే చాలా మందికి మసక దృష్టి ఉంటుంది. నూనె గ్రంథులు : నేత్రాల చుట్టుపక్కన ఉండే నూనె గ్రంథులు నిద్రిస్తున్నప్పుడు కొంత నూనె, నీటిని ఉత్పత్తి చేస్తాయి. ఇలాంటప్పుడు కళ్లలో కాస్త అసౌకర్యం, దృష్టి మసక లాంటి వాటికి ఛాన్స్ ఉంటుంది. ఆయా కారణాలను భేరీజు వేసుకుని ఉదయం పూట మీకు కళ్లు ఎందుకు మసకగా ఉంటాయో గుర్తించగలగాలి. సమస్య తీవ్రత మేరకు వైద్యుల్ని సంప్రదించి సలహా తీసుకోవడం ఉత్తమం.