వంటింట్లో ఉండే వాము స్టైలే వేరు.. కిడ్నీలో రాళ్లే తీసేయడమే కాదు ఇంకా ఎన్నో లాభాలు
వంటిల్లే ఇంటికి వైద్యశాల అని వెనుకటికి పెద్దలు చెప్పేవారు. వంటింటి పదార్థాలే అనారోగ్యాలకు ఔషధాలు. అయితే కిచెన్ రూములోని డబ్బాల్లో ఉండే వాము గురించి, దాని వినియోగం గురించి చాలా తక్కువ మందికే తెలుసు. వాము వాడకంతో ఆరోగ్యానికి వచ్చే లాభాలేంటి, ఇందులో ఉండే పోషకాలేంటి అనే అంశాలను తెలుసుకుందాం. వాము రకరకాల విటమిన్లు, మినరల్స్, పీచుపదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా కలిగి ఉంటుంది. వాములో ఉండే ఘాటైన రసాయనాలు జీర్ణశక్తిని ఇట్టే మెరుగుపరుస్తాయి. వాములోని థైమల్ రసాయనం బ్యాక్టీరియా, ఫంగల్ వైరస్ ను నిరోధిస్తుంది. తలనొప్పి, అలసట, జలుబు, మైగ్రేన్ తదితర వాటికీ వాము టానిక్ లా పని చేస్తుంది. గర్భిణీలు ఆకలి లేకపోతే వాము తింటే, ఆకలి అనిపిస్తుంది.
అజీర్తిని నివారించి జీర్ణశక్తిని పెంచే ఘాటైన అమృతం వాము
వాముతో గర్భాశయం ఆరోగ్యంగా ఉంటుంది. కడుపునొప్పితో బాధపడేవారు వామును నమిలి తిని, నీరు తాగితే ఫలితం ఉంటుంది. వామును దోరగా వేయించి పొడిచేసి నిల్వ చేసుకుని ఈ పొడిని అన్నంలో ఓ ముద్దగా కలిపి తింటే అజీర్తి తగ్గిపోతుంది. వామునీరు పుక్కలింపుతో పంటినొప్పి, చిగుళ్ల వాపులు సైతం హరిస్తాయి. తేనెతో కలిపి క్రమంగా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు పడిపోతాయని నిపుణులు అంటున్నారు. గ్లాసు నీటిలో వాము, శొంఠిపొడి వేసి మరిగించి, వడగట్టి గ్లాసులోకి తీసుకోవాలి. దీన్ని రెండు పూటలా పిల్లలకు టీ గ్లాసు మోతాదులో తాగిస్తే జీర్ణ వ్యవస్థ బాగుంటుంది. వాముపొడిని బెల్లంతో కలిపి తింటే అలర్జీలు మాయమవుతాయి. వామును నోట్లో వేసుకుని ఆ రసాన్ని మింగుతూ ఉంటే టాన్సిల్లిటిస్ (గవదబిళ్లలు) తగ్గిపోతాయి.