
International Joke Day: నవ్వు అనేది ఓ ఔషధం.. కానీ కొందరికి ఆయుధం అయ్యింది!
ఈ వార్తాకథనం ఏంటి
ఇవాళ మనిషికి డబ్బు ఉంది, హోదా ఉంది, సదుపాయాలున్నాయి. కానీ ఒక మిషింగ్ ఐటెం మాత్రం నిత్యం కనిపిస్తోంది నవ్వు. వేయి తుఫాన్లు చుట్టుముట్టినా ఆత్మస్థైర్యంగా నవ్వగలిగే, నవ్వించగలిగే వాళ్లే జీవితాన్ని గెలుస్తారు. ఒత్తిడితో నిండిన ఈ కాలంలో నవ్వు ఒక బలం, ఓ ఉపశమనం. జూలై 1న జరుపుకునే ఇంటర్నేషనల్ జోక్ డే ఈ అవసరాన్ని మళ్లీ గుర్తు చేస్తోంది. స్త్రీలకు నవ్వు ఇష్టం. ఇంట్లోనైనా, ఆఫీస్‌లోనైనా నవ్వగలిగే వాతావరణం కోరుకుంటారు. కానీ వారిని లక్ష్యంగా చేసుకుని వేసే అవమానకరమైన జోకులు మాత్రం ఇప్పటికీ ఆగడం లేదు. అలాంటివి హాస్యం కాదు. ఆరోగ్యకరమైన హాస్యం మాత్రమే ఆనందానికి మార్గం.
Deails
నవ్వు ముఖానికి మెరుపు తెచ్చే ఉచిత మేకప్
ప్రముఖ రచయిత కుష్వంత్ సింగ్‌కు ఓ ఆసక్తికరమైన సందేహం వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లిష్‌లో ప్రచారంలో ఉన్న అనేక జోకులు స్వల్ప మార్పులతో అన్ని దేశాల్లో వినిపిస్తున్నాయేంటి? ఈ సందేహం వెనుక చిన్న పరిశోధన చేశాక ఆయన తెలుసుకున్నది ఏమిటంటే.. అవన్నీ యూదు సమాజం నుంచి పుట్టినవే. రెండో ప్రపంచయుద్ధ సమయంలో తీవ్రమైన భయంతో ఉన్న వారు ఆ ఒత్తిడిని తగ్గించుకోవడానికి జోకులను రూపొందించుకున్నారు. ఆ జోకులే నానా రూపాల్లో ప్రపంచం నలుమూలలా పాకాయి. మనవాళ్లు అంటారు ''ఒక్క నవ్వు చాలు వేయి వరహాలు''.. నవ్వు ఒక అలంకారమే కాదు, మనిషి లోనివైపు ప్రతిబింబించే సంస్కారమూ. నవ్వే ముఖానికి మెరుపు తెచ్చే ఉచిత మేకప్.
Deails
తనమీద తానే జోకేసుకునేవాడు యోగి
నవ్వులో మరో విశేషం - బలవంతంగా నవ్వినా, అబద్ధంగా నవ్వినా కూడా అది మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మరి మనసారా నవ్వితే? అదైతే ఆరోగ్యానికి పక్కా బూస్ట్! కానీ జోకుల విషయంలో ఒక సమస్య మాత్రం ఉంటుంది. అవి విన్నప్పుడు నవ్వుతాం, కానీ తర్వాత గుర్తుండవు. ఎవరికైనా 'ఒక జోకు చెప్పు' అంటే బుర్ర తడుముకుంటారు. ఎందుకు గుర్తుండవు? ఇదో పెద్ద పజిల్! ఇవాళ స్టాండప్ కమెడియన్లు రాజకీయాలపై సెటైర్లు వేస్తూ ఆకర్షణీయులవుతున్నారు. రాజకీయ నేతలపై జోకులు వేస్తున్నారు. అదే సమయంలో నాయకులు కూడా వారిపై సెటైర్లు వేస్తున్నారు. ''ఇతరులు మన మీద జోకేస్తే నవ్వేవాడు భోగి.. కానీ తనమీద తానే జోకేసుకునేవాడు యోగి అన్నాడు ఒక జోక్ రీసెర్చర్.
Details
హాస్యం వ్యక్తిత్వాన్ని తుడిచిపెట్టకూడదు
ప్రస్తుత పరిస్థితుల్లో అతి అర్థహీనమైన జోకులు మహిళలపై వేసేవే. వారి అలంకరణలు, ఆచారాలు, నడవడికలపై వేసే కుళ్లు జోకులు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. భార్య తోడు లేకపోతే గంట కూడా బతకలేని భర్త, మిత్రుల మధ్య భార్యపై జోకులు వేసే తత్వం ఇంకా మారలేదు. భార్యను నవ్వించండి, కానీ నవ్వులాటగా చేయకండి. హాస్యం ఒంటరితనాన్ని తుడిచి పెట్టాలి కానీ వ్యక్తిత్వాన్ని కాదు. ఒక మనిషిని కించపరిచే ప్రయత్నం చేసే జోకు అసలు హాస్యం కాదు. మంచిజోకు విన్న మనిషి నవ్వుతాడు, దాని గురించి ఆలోచిస్తాడు. అదే హాస్య కళకు గౌరవం. జూలై 1 - ఇంటర్నేషనల్ జోక్ డే సందర్భంగా ఆరోగ్యకరమైన హాస్యాన్ని పంచుకుందాం కించపరిచే చీప్ జోకులకు చెక్ పెట్టుదాం