Love Marriage Ban : ప్రేమ పెళ్లి చేస్తే ఊరు ఖాళీ చేయాల్సిందే.. లవ్ మ్యారేజ్‌లపై ఆ గ్రామపంచాయతీ కఠిన తీర్మానం
ఈ వార్తాకథనం ఏంటి
వాలెంటైన్స్ డే వచ్చేసరికి చాలా మంది ప్రేమికులు పెళ్లి కలలు కంటారు. ఇంట్లో పెద్దలను ఒప్పించి, తమ ప్రేమను వివాహ బంధంగా మార్చుకోవాలని భావిస్తారు. కానీ ఒక గ్రామంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. అక్కడ తల్లిదండ్రులు ఒప్పుకున్నా సరే, గ్రామమే అంగీకరించదట. ప్రేమించి పెళ్లి చేసుకున్నారని తెలిసిన వెంటనే.. అబ్బాయి అయినా, అమ్మాయి అయినా—గ్రామం నుంచి బయటకు పంపించే పరిస్థితి. అంతేకాదు, వారి మీద కఠినమైన నిషేధాలు కూడా విధిస్తారు. అసలు ఆ గ్రామంలో ప్రేమ పెళ్లి చేస్తే ఏమవుతుంది? ఎలాంటి ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది? అన్న వివరాలు ఇప్పుడు చూద్దాం.
వివరాలు
వారిని గ్రామం నుంచి తరిమివేయాలనే నిర్ణయం
పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లా అజ్నాలా తహసీల్ పరిధిలో ఉన్న ధరివాల్ గ్రామ పంచాయతీ ఈ వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. గ్రామంలో ప్రేమ వివాహాలను పూర్తిగా నిషేధిస్తూ పంచాయతీ పెద్దలు సమావేశమై ఒక తీర్మానాన్ని ఆమోదించారు. గ్రామానికి చెందిన అబ్బాయి, అమ్మాయి ఎవరైనా పరస్పరం పెళ్లి చేసుకుంటే, వారిని గ్రామం నుంచి తరిమివేయాలనే నిర్ణయాన్ని ప్రజల సమ్మతితో తీసుకున్నట్లు తెలిపారు. గ్రామ పెద్దల మాటను లెక్కచేయకుండా ఎవరికైనా ప్రేమ వివాహం చేస్తే, ఆ జంటను గ్రామం నుంచి బహిష్కరిస్తారు. అంతేకాదు, ఆ అబ్బాయి, అమ్మాయి కుటుంబాలను కూడా సామాజికంగా వెలివేస్తారు.
వివరాలు
ప్రభుత్వ సౌకర్యాలు కూడా అందకుండా..
పెళ్లి చేసుకున్న వారికి పంచాయతీతో పాటు ప్రభుత్వ సౌకర్యాలు కూడా అందకుండా చేస్తారు. వారికి సంబంధించిన సర్టిఫికెట్లు, ఇతర అధికారిక పత్రాలపై సంతకాలు చేయరని పంచాయతీ స్పష్టం చేసింది. భవిష్యత్తులో వారికి ఏదైనా సమస్య ఎదురైతే, గ్రామానికి చెందిన ఒక్కరు కూడా పోలీస్ స్టేషన్‌లో గానీ, కోర్టులో గానీ సాక్ష్యంగా నిలబడరని హెచ్చరించారు. ఈ కఠిన నిర్ణయానికి కారణం ఏమిటంటే.. ఇటీవల అదే గ్రామానికి చెందిన ఐదు నుంచి ఆరు వివాహాలు జరగడం. ఒకే గ్రామంలో పెళ్లిళ్లు కావడంతో అత్తమామలు ఒకే వీధిలో, కొన్నిసార్లు ఎదురెదురుగా ఉండాల్సి వస్తోందని గ్రామ పెద్దలు చెబుతున్నారు. దీంతో ఆ అమ్మాయి తమ కూతురా లేక కోడలా అన్న గందరగోళం ఏర్పడుతోందట.
వివరాలు
సంబంధాల్లో ఉద్రిక్తతలు.. కుటుంబాల మధ్య వివాదాలు
ఈ పరిస్థితి కారణంగా సంబంధాల్లో ఉద్రిక్తతలు పెరిగి, కుటుంబాల మధ్య వివాదాలు ఎక్కువవుతున్నాయని వారు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రేమ పెళ్లిళ్లే కాకుండా, పెద్దలు కుదిర్చే వివాహాలను కూడా గ్రామంలో నిషేధించాలని పంచాయతీ నిర్ణయించింది. ఫిబ్రవరి 7న ఈ తీర్మానం తీసుకున్నారు. గ్రామానికి చెందిన అబ్బాయి, అదే గ్రామానికి చెందిన అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహం చేసుకోకూడదని ప్రజా సమ్మతితో పంచాయతీ తీర్మానాన్ని ఆమోదించింది. ఒకే గ్రామంలో పెళ్లి అనేది సామాజిక నియమాలు, సంప్రదాయాలకు విరుద్ధమని పంచాయతీ అభిప్రాయం. ఈ తప్పుడు ఆచారాన్ని పూర్తిగా ఆపేందుకు ఇంత కఠినమైన చర్యలు తప్పవని గ్రామ పెద్దలు అంటున్నారు.
వివరాలు
తల్లిదండ్రులతో కూడా ఎలాంటి సంబంధాలు కొనసాగించకూడదని స్పష్టం
ఈ నిబంధనను ఉల్లంఘించి గ్రామంలో పెళ్లి చేసుకున్న జంటలను పూర్తిగా సామాజికంగా వెలివేస్తారు. పంచాయతీ నిర్ణయం ప్రకారం, అటువంటి జంటలు గ్రామంలో నివసించడానికి అనుమతి ఉండదు. వారు తప్పనిసరిగా గ్రామం విడిచిపోవాల్సిందే. అంతేకాదు, వారి తల్లిదండ్రులతో కూడా ఎలాంటి సంబంధాలు కొనసాగించకూడదని స్పష్టం చేశారు. ఈ నిషేధం కేవలం ఆ జంటలకే పరిమితం కాదు. అలాంటి జంటలతో ఎవరు కలిసినా, వారితో సహవాసం చేసినా లేదా ఏ రూపంలో అయినా సహాయం చేసినా, ఆ వ్యక్తినీ సామాజికంగా బహిష్కరిస్తామని పంచాయతీ ప్రతిపాదనలో పేర్కొన్నారు.
వివరాలు
కులాంతర వివాహాలపై కూడా ఆంక్షలు
పంజాబ్‌లోని పలు గ్రామాల్లో గతంలోనూ ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న ఉదాహరణలు ఉన్నాయని, కులాంతర వివాహాలపై కూడా ఆంక్షలు విధించిన సందర్భాలు ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. అందుకే తమకు ఇది కొత్త విషయం కాదని వారు వ్యాఖ్యానిస్తున్నారు.