ఆరోగ్య విషయంలో రాజీలేకుండా పండుగలను ఎలా ఆస్వాదించాలో తెలుసా
పండుగ సీజన్‌లో ఎటువంటి చీకు చింతా లేకుండా నచ్చిన ఆహారాలను ఆరగించాలని ఉందా. అయితే ఇందుకోసం అనుసరించాల్సిన డైట్ చిట్కాలను తెలుసుకోవాల్సిందే మరి. భారతదేశంలోని పండుగలు రుచికరమైన, బలమైన ఆహారం వంటి వాటికి పర్యాయపదాలుగా నిలిచాయి. తీపితో కూడిన కమ్మని విందుకు నిదర్శనం. పండుగ వేళల్లో రకరకాల వంటకాలతో బరువు పెరగడం, గ్లూకోజ్ స్థాయిల పెరుగుదల వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అయితే భయపడాల్సిందేం లేదు. పండుగ విందును వదులుకోకుండా, కమ్మని విందును ఆరగించేందుకు సిద్ధం కండి. ఈ మేరకు మీకు మార్గనిర్దేశం చేసేందుకు, ప్రముఖ పోషకాహార నిపుణురాలు రాశీ చౌదరి అమూల్యమైన చిట్కాలు అందిస్తున్నారు. దీంతో మీ ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకుంటూ పండుగ సీజన్‌ను ఎలా ఆనందించాలో మీకు అర్థమవుతుంది.
పండుగ సీజన్‌లో ఫుడ్ ఎంజాయ్ చేయాలంటే 5 వ్యూహాలు తప్పనిసరి
1. మితంగా తినాలి : ఇష్టమైన ఆహారం అని చెప్పి ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిదికాదు. అందువల్ల ఆహారం ఏదైనా మితంగా తింటే ఔషధం. 2. హైడ్రేటెడ్ గా ఉండండి : మంచి ఆరోగ్యం కోసం తరచుగా నీరు తాగుతుండాలి. ఆహారాలతో మీ ఆకలిని తీర్చుకునే బదులు, శక్తివంతంగా ఉండేందుకు మీ శరీరంలో ఎలక్ట్రోలైట్‌ల నిల్వలను పెంచుకోవాలి. మితిమీరిన స్నాక్స్ కోరికలను అరికట్టడంలో ఇది సహాయపడుతుంది. 3. చింత లేకుండా తినండి : మీ ఆహారాన్ని మీ ఇష్టపూర్వకంగా, మనస్ఫూర్తిగా తినండి. మీ ఆహారాన్ని కొద్ది కొద్దిగా తినడం మంచిది. ఆహారాన్ని కోరుకున్నంత ఆస్వాదించే ముందు మరుసటి రోజు మీ దినచర్యను పరిగణలోకి తీసుకోవాలి.
గ్లూటెన్, డైరీ, చక్కెరను అధికంగా వాడకూడదు : రాశి చౌదరి
4. స్మార్ట్ ట్రావెల్ ఈటింగ్ : మనలో చాలామంది పండుగల సీజన్‌లో సెలవులను ప్లాన్ చేసుకుంటారు. అందువల్ల, వెంట ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారాలను తీసుకెళ్లడం ఉత్తమం. దీంతో కెలరీలను అదుపులో ఉంచుకునేందుకూ ఇదో వ్యూహాత్మక మార్గం. 5. గ్లూటెన్, డైరీ, చక్కెరను నివారించండి : పండుగ సంబురాలకు సిద్ధం అయ్యే క్రమంలో కొన్ని పడని పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. వాస్తవానికి, మీరు డెజర్ట్‌లను ఇంట్లోనే తయారు చేసుకోవడం శ్రేయస్కరం. విందులను ఆస్వాదిస్తూ, పదార్థాలపై నియంత్రణను ఉంచుకోవడానికి ఉపకరిస్తాయి. ఆరోగ్యంగా ఉంటూ, నచ్చింది తినేందుకు ఇంటి ఆహారం ఉత్తమమని ప్రముఖ పోషకాహార నిపుణురాలు రాశీ చౌదరి తెలిపారు.