ప్రేరణ: జీవితాన్ని పరుగు పందెంలా భావిస్తే గమ్యాన్ని ఎప్పటికీ చేరుకోలేవు
లైఫ్ ఈజ్ రేస్ అని చాలామంది చెబుతారు. జీవితంలో ఎప్పుడూ పరుగెడుతూనే ఉండాలంటారు. ఇలా చెప్పే వారందరూ ఎక్కడ ఆగాలో చెప్పరు. తీరా ఆగిపోయేలోగా మనచుట్టూ ఎవ్వరూ ఉండరు. పిల్లల్లో విదేశాల్లో, పెద్దలు పై లోకాల్లో, చుట్టు పక్కలవాళ్ళు వాళ్ల ఇళ్ళలో ఉంటారు. అప్పుడు అనిపిస్తుంది, ఇంతలా పరుగెత్తింది దేనికిరా అంటే, ఒంటరిగా మిగలడానికని. పరుగు పందెంలో పాల్గొనేవాడు గోల్ రీచ్ కావాలని మాత్రమే చూస్తుంటాడు. వాడి చుట్టుపక్కల ఎంత మంది ఉన్నా వాడు పట్టించుకోడు. తీరా గెలిచిన తర్వాత ఆనందం ఉరకలేస్తుంది. ఆ ఆనందం ఉండేది కొద్దిసేపే. ఆ తర్వాత మరో పరుగు పందెం మొదలవుతుంది. అందులో గెలిచిన తర్వాత ఇంకో పందెం మొదలవుతుంది.
పోలిక వల్ల అశాంతి
అలా నీ జీవితంలో ప్రతీసారీ ఏదో ఒక పందెం ఉంటూనే ఉంటుంది. పందెం అన్న కాన్సెప్ట్ వచ్చినపుడు అవతలి వాళ్ళతో పోలికలు మొదలవుతాయి. అవతలి వాళ్ళకు ఎంత డబ్బుంది? నేనెంత సంపాదించాలి. పక్కవాడు రెండు ఇండ్లు కొన్నాడు. నేను ఎన్ని కొనాలి? పక్కన వాడి భార్యకు ఏడు వారల నగలున్నాయి. నేను అంతకంటే ఎక్కువ బంగారం కొనాలి. ఇలా ప్రతీ దాంట్లో పోలికే. అవతలి వాడితో నువ్వెప్పుడైతే పోల్చుకుంటావో అప్పుడు నీకు మనఃశాంతి దూరమవుతుంది. దిగులు వచ్చి నీ మనసులో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఇక్కడ ఉద్దేశ్యం జీవితంలో ఏమీ సాధించకుండా ఉండిపొమ్మని కాదు. జీవితాన్ని ఆస్వాదించమని. జీవితాన్ని ఆస్వాదించలేని వాడి దగ్గర ఎన్ని డబ్బులున్నా వృధానే.