ప్రేరణ: నీకు ఎదురయ్యే అనుభవాలపై నువ్వెలా స్పందిస్తావన్న దాన్ని బట్టే నీ జీవితం ఉంటుంది
నువ్వు జీవితంలో ఎలా ఉండాలని కోరుకుంటున్నావ్, నీకొక ఐడియా ఉందా? నువ్వెలా ఉండాలనుకుంటున్నావో అలానే ఉంటున్నావా? ఒకసారి ఆలోచించుకో. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. జీవితం నువ్వు అనుకుంటున్నట్టు ఎప్పుడూ ఉండదు. రకరకాల అనుభవాలు నీకు ఎదురవుతుంటాయి, కొన్నిసార్లు నువ్వు ఊహించని పరిణామాలు కూడా జరుగుతుంటాయి. ఇలాంటప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయాలే నీ జీవితాన్ని నిర్దేశిస్తాయి. నీకు ఎదురైన అనుభవాలకు నువ్వెలా ప్రతిస్పందిస్తావన్నదే ముఖ్యం. ఎందుకంటే అదే నీ జీవితం ఎటువైపు వెళ్లాలనేది డిసైడ్ చేస్తుంది. అందుకే నిర్ణయాలు తీసుకోవడంలో కాస్త ఆలోచించు, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకు. నువ్వు ఆవేశంలో తీసుకున్న ఆ ఒక్క నిర్ణయమే నిన్ను జీవితాంతం బాధపడేలా చేయవచ్చు.
రియాక్షన్ నెగెటివ్ గా ఉండొచ్చు పాజిటివ్ గా ఉండవచ్చు
ఒక అనుభవానికి మనం ఎలా రియాక్ట్ అయినా, అది మనకు ఏదో ఒక రూపంలో దాన్ని రియాక్షన్ ని ఇస్తుంది. కొన్నిసార్లు ఆ రియాక్షన్ నెగెటివ్ గా ఉండొచ్చు పాజిటివ్ గా ఉండవచ్చు. ఉదాహరణకు మీరొక దారిలో వెళ్తుండగా మీకు 500 రూపాయల నోటు దొరికింది. దాన్ని తీసుకుని జేబులో పెట్టేసుకున్నారు. మిమ్మల్ని ఎవ్వరూ చూడలేదు. సో మీరు హ్యాపీగా ఇంటికి వచ్చేసారు. ఇక్కడ మీకు ఎదురైన అనుభవం మీకు ఆనందాన్ని ఇచ్చింది. ఒకవేళ మీరు 500 తీసుకుని జేబులో పెట్టుకోబోతుండగా అది పారేసుకున్న మనిషి వచ్చి, 500 రూపాయల నోటు తనదని అన్నాడు. మీరేమో కాదు నాదన్నారు. ఇక్కడే గొడవ మొదలై ఆ పరిస్థితిని ఎక్కడికో తీసుకెళ్తుంది.