ప్రేరణ: ఏమీ లేదని బాధపడే ముందు ఈ రోజు ఉందని గుర్తుంచుకుంటే విజయం నీదే
జీవితంలో ఏదీ సాధించలేమని ఎప్పుడూ బాధపడకూడదు. వయస్సు, డబ్బు, స్నేహితులు, బంధువులు, తెలివి, నైపుణ్యం ఏదీ నీకు లేకపోయినా నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఎందుకంటే నీ దగ్గర ఈరోజు ఉంది. 24గంటల సమయం నీ దగ్గర ఉంది. దీన్ని నీ నుండి ఎవరూ తీసుకుపోలేరు. వయస్సు పైబడ్డ వారికయినా, డబ్బు లేకపోయిన వారికైనా, బంధువులు లేని వారికయినా సమయం మాత్రం ఉంటుంది. నువ్వు ఎంచుకున్న రంగంలో విజయం సాధించాలంటే ఈరోజును పెట్టుబడి పెట్టు. ఇప్పుడు పెట్టుబడి పెడితేనే రేపు ఆదాయం వస్తుంది. జీవితంలో నువ్వేది కావాలనుకున్నా ఆ రంగంలో ఈరోజు పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి పెట్టని వాడికి ఆదాయం ఉండదు. అలాంటి వాళ్ళు బాధపడితే లాభమేముంది?
నీ శక్తిని తక్కువ చేసుకోకు
ఎంతోమంది వయసు పైబడిన తర్వాతే తాము అనుకున్న రంగాల్లో విజయాలు అందుకున్నారు. అందులో కే ఎఫ్ సీ సృష్టికర్త ఒకరు. ఎంతోమంది ఏమీ లేని స్థితి నుండి వందల కోట్లకు అధిపతులుగా మారారు. ఎంతోమంది ఎవ్వరూ లేని స్థితి నుండి ఎంతో మంది చేయూతగా మారిన వారున్నారు. నువ్వు ఆలోచించాల్సిందల్లా, వారిలా కావాలంటే ఏం చేయాలని ఆలోచించాలి. అంతేకానీ నాకు సౌకర్యాలు లేకపోవడం వల్లే ఇక్కడ ఉండిపోతున్నానని అనుకోకోకూడదు. అలా అనుకుంటే నీ శక్తిని నువ్వు తక్కువ చేసుకున్నట్టే. శక్తిని తక్కువ చేసుకుని జీవితాంతం బాధపడతావో, లేక ఈరోజును ఉపయోగించుకుని నీలో శక్తిని పెంచుకుని రేపటి జీవితాన్ని బంగారంలా మార్చుకుంటావో నీ ఇష్టం.